“పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ప్రమాదాల్లో పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి, మృతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం”

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 9,2024: రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 9,2024: రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పోలీసులు బాధ్యతగా పని చేయకపోతే వారు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయన్నారు. ఇటీవల కాకినాడ జిల్లా తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఈ వ్యవహారంలో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుల తల్లిదండ్రులను పోలీసులు వ్యవహరించిన తీరు ఆ కుటుంబాలకు తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని తెలిపారు.

శనివారం మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో ఇటీవల తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భీమవరం ప్రాంతానికి చెందిన పోలిశెట్టి రేవంత్ శ్రీమురహరి, విజయవాడకు చెందిన నాదెండ్ల నిరంజన్ ల కుటుంబ సభ్యులను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు. ప్రమాద వివరాలు తెలుసుకుని చలించిపోయారు. మృతుల కుటుంబాలకు తన ట్రస్ట్ ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన విషయం బాధించింది.

ప్రమాదంపై ఫిర్యాదు చేసేందుకు వారి తల్లిదండ్రులు సమీపంలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లగా అక్కడ అధికారులు ప్రవర్తించిన తీరు సరిగా లేదని తెలిసింది. కనీసం సమాధానం చెప్పకపోగా పోలీసులు మాట్లాడిన తీరు బాగాలేదు. రోడ్డు ప్రమాదంలో బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ తీవ్రమైనది. అంతటి కష్టాన్ని దిగమింగుకున్నారు. ఇద్దరు విద్యార్థుల్లో శ్రీ రేవంత్ బ్రెయిన్ డెడ్ అయితే… ఆయన తల్లిదండ్రులు అవయవదానం చేయడం నన్ను కదిలించింది. అయితే పోలీసులు ప్రమాదానికి కారణం అయిన డ్రైవర్ పై ఎలాంటి కేసులు పెట్టలేదని తెలిసింది. కారులో ప్రయాణిస్తున్న వైద్యుడు కూడా బాధ్యతగా వ్యవహరించకపోవడం దారుణం.
• కేసుల భయాలు కంటే రోడ్డు ప్రమాద సమయాల్లో తక్షణ సాయం అవసరం
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారిని తక్షణం ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఘటనా స్థలిలో ఉన్నవారిపై ఉంటుంది.

కేసుల భయాల నుంచి బయటకు రావాలి. పోలీసులు ఉన్నతాధికారులు ఈ అంశం మీద అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి. క్షతగాత్రులకు తక్షణం వైద్యం అందితే ప్రాణాలు దక్కే అవకాశం ఉంటుంది. కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనలో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల నేను క్షమాపణలు చెబుతున్నాను” అన్నారు.

About Author