హైదరాబాద్‌లో హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్.. రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 7,2025: హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హైడ్రా

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 7,2025: హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హైడ్రా) ఇకపై మరింత కఠినంగా వ్యవహరించనుంది.

ఇందుకోసం హైడ్రాకు సొంతంగా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. బుద్ధభవన్ పక్కనే హైడ్రా కార్యాలయంలో నూతనంగా నిర్మించిన ఈ పోలీస్ స్టేషన్‌ను రేపు (గురువారం) ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్), అగ్నిమాపక శాఖ తరహాలోనే హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రావడంతో అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం మరింత సులభతరం కానుంది. ఈ పోలీస్ స్టేషన్‌కు ఏసీపీ పి. తిరుమల్‌ను స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో)గా నియమించారు.

ప్రస్తుతం ఒక సీఐతో పాటు ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12 మంది ఎస్సైలు, 30 మంది కానిస్టేబుల్స్ ఈ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో జీ+2 అంతస్తుల్లో సుమారు 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పోలీస్ స్టేషన్‌ను నిర్మించారు.

అక్రమాలపై నేరుగా హైడ్రా పోలీస్ స్టేషన్‌లోనే కేసులు:

ప్రభుత్వ భూములు, ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలు, పార్కులు, రోడ్లు, చెరువులు, నాలాలను ఆక్రమించిన వారిపై ఇకపై నేరుగా హైడ్రా పోలీస్ స్టేషన్‌లోనే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. అంతేకాకుండా, ఈ పోలీస్ స్టేషన్‌కు సంక్రమించిన ప్రత్యేక అధికారాలతో నిందితులను అరెస్టు చేసే అవకాశం కూడా ఉంటుంది.

చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల్లో మట్టి నింపినా, అక్రమంగా తరలించినా సంబంధిత వ్యక్తులు, వాహనదారులతో పాటు మట్టిని తరలించేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్న వారిపై కూడా కేసులు నమోదు చేస్తారు. మురుగునీటిని నేరుగా చెరువుల్లోకి వదిలే వారిపై సైతం చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.

ఆక్రమణల వెనుక ఉన్న సూత్రధారులపై దృష్టి:

హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల వెనుక ఉన్న అసలు సూత్రధారులను వెలికి తీయనుంది. పేదవారిని అడ్డుపెట్టుకుని భూములు కాజేసే బడా వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు.

This is also read.. Over 165 IndiGo Flights Cancelled Until May 10 Due to Government Airspace Restrictions..

This is also read.. Robinhood on ZEE5 & Zee Telugu..

నకిలీ పత్రాలు సృష్టించి లేఅవుట్లను మాయం చేసే వారిని, ప్రభుత్వ భూములను ఆక్రమించాలని చూసే వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తారు.

వాల్టా చట్టం, అగ్నిమాపక చట్టాల ఉల్లంఘనులను నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించి శిక్షలు అమలు చేస్తారు. లేఅవుట్లలో రోడ్లు, ప్రజా స్థలాలను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ల యజమానులను నియంత్రిస్తారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిపై తక్షణ చర్యలు తీసుకుంటారు.

సామాన్యులకు అండగా హైడ్రా పోలీసులు..

లేఅవుట్లలో కొందరు వ్యక్తులు పక్కనే ఉన్న ఖాళీ స్థలాలను ఆక్రమించుకుని పాత లేఅవుట్లను మార్చేస్తే వారిపై హైడ్రా పోలీస్ స్టేషన్ కఠినంగా వ్యవహరిస్తుంది. లేఅవుట్లలో రోడ్లు, పార్కులతో పాటు సామాన్యుల ప్లాట్లను కాజేసిన వారిని విచారించి వారికి న్యాయం జరిగేలా చూస్తుంది.

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే హైడ్రా వందల ఎకరాల ప్రభుత్వ భూములను, పలు చెరువులు, పార్కులు, నాలాలను పరిరక్షించింది.

ఆయా ఆక్రమణలకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న 50కి పైగా కేసులను ఇకపై హైడ్రా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయనున్నారు. సమస్య మూలాల్లోకి వెళ్లి, సరైన ఆధారాలతో ఆక్రమణదారులను జైలుకు పంపడమే లక్ష్యంగా హైడ్రా పోలీస్ స్టేషన్ పనిచేయనుంది.

About Author