గత ప్రభుత్వం వ్యవస్థలను ఆటబొమ్మలుగా మార్చింది:ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్‌ కళ్యాణ్‌

0

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 5,2024:‘164 శాసనసభ స్థానాలు… 21 లోక్ సభ స్థానాలు… 93 శాతం స్ట్రయికింగ్ రేట్ తో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. వారు

• వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా కూటమి పాలన
• ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, బాధలు తట్టుకొని ప్రభుత్వాన్ని స్థాపించాం
• ప్రజల నమ్మకానికి న్యాయం చేస్తాం
• రాష్ట్ర ప్రగతి కోసం సమష్టిగా పని చేద్దాం
• ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పాలన దక్షతతో రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొద్దాము
• సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 5,2024:‘164 శాసనసభ స్థానాలు… 21 లోక్ సభ స్థానాలు… 93 శాతం స్ట్రయికింగ్ రేట్ తో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. వారు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాల’ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్నీ తట్టుకొని నిలబడ్డామన్నారు.

బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చిందని చెప్పారు. అత్యుత్తమ పాలనలో ఒకప్పుడు మోడల్ గా ఉన్న రాష్ట్రం… గత ఐదేళ్ల పాలనలో ఎంత దారుణంగా దిగజారిపోయిందో చూశామనీ, గత పాలకుల విధానాల వల్ల పాలన ఎలా ఉండకూడదు అనే విషయానికి రాష్ట్రం మోడల్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మన రాష్ట్రంలో పనిచేయడానికి పోటీ పడేవారని, మళ్లీ అలాంటి పరిస్థితి తీసుకొద్దామని అన్నారు.

ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పాలన దక్షతతో రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకొద్దామని పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “వ్యవస్థలను బలోపేతం చేయాలని రాజకీయాల్లోకి వచ్చాం. మేము ఈసారి అధికారంలోకి రాకపోయినా ప్రజాస్వామ్యంలో నిలబడి వ్యవస్థను బలోపేతం అయ్యేలా చేసేవాళ్లం. దేవుడి దయవల్ల అధికారంలోకి వచ్చాం. మాది మంచి ప్రభుత్వం.. జవాబుదారీతనం ఉన్న ప్రభుత్వం.

• పంచాయతీల బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నాం

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, రక్షిత మంచినీటి సరఫరా, అటవీశాఖ, శాస్ర్తసాంకేతిక శాఖలను తీసుకున్నాను. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి రిజల్యూషన్ చేస్తున్నాం. తద్వారా పంచాయతీలను బలోపేతం చేస్తాం. గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అమలు చేస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గంలో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ను పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. జలజీవన్ మిషన్ ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో 5.4 కోట్ల గృహలకు తాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కొత్త రోడ్లు, ఉన్న రోడ్లు బాగు చేయడం మా ప్రభుత్వ లక్ష్యం.

ఈ ఆర్థిక సంవత్సరంలో 4721 కిలోమీటర్ల రోడ్లను మరమ్మత్తు చేయాలని నిర్ణయించుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 29.23 శాతం 37,400 చదరపు కిలోమీటర్ల నోటీఫై చేసిన అడవులు ఉన్నాయి. నోటిఫై చేసిన అటవీ పరిధికి అదనంగా 10,221 చదరపు కిలోమీటర్ల గ్రీన్ కారిడార్ ఉంది. చెరువు తీరాలు, ఇనిస్టిట్యూషన్ ల్యాండ్స్, పంచాయతీ ల్యాండ్స్ లో కూడా అటవీకరణను ప్రోత్సహించాల్సి ఉంది. గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అటవీ పరిధి తక్కువగా ఉంది. ఇక్కడ అడవులు పెంచేందుకు కృషి చేయాల్సి ఉంది.

• వికసిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరి సహకారం అవసరం

‘రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా.. దాన్ని అమలు పరిచేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్థ పని చేయదు. బలహీనమైన రాజ్యాంగం ఉన్నా ప్రజల కోసం పని చేసేవారు ఉంటే ఆ వ్యవస్థ కచ్చితంగా పనిచేస్తుందని డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు. గత ప్రభుత్వంలో వ్యవస్థలను ఎలా చిధ్రం చేశారో మనం చూశాం.

పాలన అనుభవం ఉన్న వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, నేర్చుకోవాలనుకునే తపన ఉన్న నాలాంటి వ్యక్తి, పాలన అనుభవం ఉన్న మంత్రి వర్గ సహచరులు కలిసి వ్యవస్థలను ముందుకు తీసుకువెళతాం. శ్రీ చంద్రబాబు నాయుడు గారి విజన్‌ను తాము ముందుకు తీసుకువెళతాం. విభజన ముందు 20 ఏళ్ల పాటు అవమానాలు.. ఇబ్బందులుపడ్డాం.

• రాష్ట్రంలోకి అనుమతించని పరిస్థితి

రాష్ట్ర విభజన నాటి నుంచి ఇప్పటి వరకు మనం నలుగుతూనే ఉన్నాం. గత ప్రభుత్వంలో బోర్డర్ దాటి రాష్ట్రంలోకి రావడానికి కూడా అనుమతించని పరిస్థితి. అన్నింటినీ దాటుకుని ముందుకు వచ్చాం. పరిపాలనలో ఒక అడుగు ముందుకు పడాలి తప్ప వెనక్కి వెళ్ల కూడదు. రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. 2047లో భారత్ సూపర్ పవర్ కావాలన్నా, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం పూర్తి కావాలన్నా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సహకారం అవసరం” అన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *