మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేలా ప్రణాళిక..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ , అక్టోబరు 17, 2025: ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ , అక్టోబరు 17, 2025: ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగం, శాస్త్రవేత్తలతో చర్చించారు. మత్స్యకారులలో చేపల వేట సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఉన్న అవకాశాలు, మత్స్యకారులకు అదనపు ఆదాయం సముపార్జనకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
శుక్రవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో 100 రోజుల ప్రణాళిక అమలుపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో పాటు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ), విశాఖ శాస్త్రవేత్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇటీవల కాకినాడ పర్యటన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో చర్చించారు.

ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో సదుపాయాలు కల్పించడంతోపాటు వారి జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ఉన్న అవకాశాలు అన్వేషించాలని సూచించారు. ముఖ్యంగా చేపల వేటలో మెలకువలు నేర్పడం, నైపుణ్యం పెంచడంతోపాటు తగిన సౌకర్యాల కల్పనపైనా దృష్టి సారించాలని తెలిపారు.
వీటితోపాటు మత్స్య సంపదను పెంపొందించడం తదితర అంశాలపై విశాఖ సీఎంఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జోయ్ కె. కిజాకుడాన్ గారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఆయన సూచనలను అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కు సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ, మత్స్య శాఖ కమిషనర్ శ్రీ రామశంకర్ నాయక్, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎస్పీ బిందు మాధవ్, పడా ప్రాజెక్ట్ డైరెక్టర్ చైత్ర వర్షిణి తదితరులు పాల్గొన్నారు.