కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం వంద రోజుల్లో: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఉప్పాడ, అక్టోబర్ 9 2025 : ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప్పాడ తీరంలో మత్స్యకారుల కాలుష్య సమస్యపై స్పందించి, దానికి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఉప్పాడ, అక్టోబర్ 9 2025 : ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప్పాడ తీరంలో మత్స్యకారుల కాలుష్య సమస్యపై స్పందించి, దానికి శాశ్వత పరిష్కారం చూపే బాధ్యత తనదని ప్రకటించారు.

పరిశ్రమల కలుషిత జలాల సమస్యకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయడానికి కనీసం వంద రోజుల సమయం కావాలని, ఈ అంశంపై పిఠాపురం మోడల్ను రాష్ట్రమంతటా అమలు చేస్తామని వెల్లడించారు.

మత్స్యకారుడిగానే వచ్చా: తాను ఉప ముఖ్యమంత్రిగా కాకుండా, మత్స్యకారుడి బాధను అర్థం చేసుకునేందుకు వారిలో ఒకడిగా వచ్చానని స్పష్టం చేశారు. మత్స్యకారుల వేదనను స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

సముద్రంలోకి వెళ్లి పరిశీలన: సమస్య తీవ్రతను తెలుసుకునేందుకు మరో మూడు రోజుల్లో తిరిగి వచ్చి, స్వయంగా పడవలో సముద్రంలోకి వెళ్లి కాలుష్య ప్రాంతాన్ని పరిశీలిస్తానని ప్రకటించారు.

ఉప్పాడ రక్షణ గోడ నా బాధ్యత: ఉప్పాడ తీర ప్రాంత కోత నివారణకు రక్షణ గోడ నిర్మాణం బాధ్యత తాను తీసుకుంటా నని హామీ ఇచ్చారు. రూ.323 కోట్ల ప్రతిపాదనలపై కేంద్రంతో మాట్లాడి నిధులు సాధించి, తన హయాంలోనే ఈ పని పూర్తి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

పారిశ్రామికాభివృద్ధి కీలకం: పరిశ్రమలను మత్స్యకారులు వ్యతిరేకించడం లేదని, కేవలం కాలుష్యాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారని, ఇది వారి అభివృద్ధిపై ఉన్న అవగాహనకు నిదర్శనమని కొనియాడారు.

రాజకీయ బెదిరింపులు సహించం: పారిశ్రామికవేత్తలను అడ్డుపెట్టుకుని రాజకీయ నాయకులు బెదిరించినా, భయపెట్టినా సహించేది లేదని హెచ్చరించారు.

సమగ్ర ప్రణాళిక: కాలుష్యంపై ప్రత్యేక కమిటీ వేసి, అన్ని శాఖలను సమన్వయం చేసి, సమస్యను గుర్తించి, యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని తెలిపారు. తెలంగాణ తరహాలో వ్యర్థాలను పూర్తిస్థాయిలో శుద్ధి చేసే ప్రణాళికను పటిష్టంగా అమలు చేస్తామన్నారు.

ఉద్యోగాలకు భరోసా: ఆక్వా రంగం రాష్ట్రానికి రూ.1.3 లక్షల కోట్ల ఆదాయాన్ని, 3.72 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పిస్తోందని గుర్తు చేశారు. ఈ బహిరంగ సభలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

About Author