ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 1,2025: ఒంటిమిట్ట ఏకశిలానగరంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 1,2025: ఒంటిమిట్ట ఏకశిలానగరంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయంలో ఏప్రిల్ 6 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు నిర్వహించనుంది, ఇది ఒక ప్రాచీన ఆనవాయితీ.
ఈ సందర్భంగా, ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారు. అనంతరం, ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగి, గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీగరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయడం జరిగింది.
ఇది కూడా చదవండి...తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు..
తర్వాత, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలను కలిపి పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులను ఉదయం 11.30 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నటేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు:
తేదీ:
06-04-2025
ఉదయం – ధ్వజారోహణం (ఉదయం 9.30 నుంచి 10.15 గంటల వరకు వృషభ లగ్నం)
రాత్రి – శేష వాహనం
07-04-2025
ఉదయం – వేణుగానాలంకారము
రాత్రి – హంస వాహనం
08-04-2025
ఉదయం – వటపత్రశాయి అలంకారము
రాత్రి – సింహ వాహనం
09-04-2025
ఉదయం – నవనీత కృష్ణాలంకారము
రాత్రి – హనుమంత వాహనం
10-04-2025
ఉదయం – మోహినీ అలంకారము
రాత్రి – గరుడసేవ
11-04-2025
ఉదయం – శివధనుర్భాణ అలంకరణ
రాత్రి – కళ్యాణోత్సవము/ గజవాహనము
12-04-2025
ఉదయం – రథోత్సవం
13-04-2025
ఉదయం – కాళీయమర్ధనాలంకారము
రాత్రి – అశ్వవాహనం
14-04-2025
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం
ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు.