భారతీయ ధర్మం, సంస్కృతి… స్త్రీ ఔన్నత్యాన్ని చాటుతాయి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,అక్టోబర్ 11,2025: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడలోని తుమ్మలపల్లివారి కళాక్షేత్రంలో శనివారం (అక్టోబర్ 11,

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,అక్టోబర్ 11,2025: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడలోని తుమ్మలపల్లివారి కళాక్షేత్రంలో శనివారం (అక్టోబర్ 11, 2025) జరిగిన ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు. శ్రీమతి లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన ఈ నవల తెలుగు అనువాదాన్ని సీనియర్ జర్నలిస్ట్ ఎ. కృష్ణారావు చేశారు.

పవన్ కళ్యాణ్ ప్రసంగ సారాంశం:

“స్త్రీ శక్తి అసాధారణమైనది. అది సూర్యుడిని కూడా కబళించగల అమోఘమైన శక్తి. భారతీయ సంస్కృతి, ధర్మం, సంప్రదాయాలు స్త్రీలకు అత్యున్నత స్థానాన్ని కల్పిస్తాయి. చిన్నతనం నుంచి నాకు పుస్తకాలు చదవడం అలవాటు. నా తల్లి నాకు మొదటగా బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’ పుస్తకాన్ని ఇచ్చారు. శ్రీమతి లక్ష్మీ ముర్డేశ్వర్ పురి ఉన్నత పదవులు నిర్వహిస్తూనే, ఈ అద్భుతమైన పుస్తకాన్ని రచించడం గొప్ప విషయం. ఆమె లాంటి మహిళల ఆలోచనలు మహిళా సాధికారతకు స్ఫూర్తిగా నిలుస్తాయి.”

పుస్తక పఠనం ప్రాముఖ్యత: “పుస్తకాలు చదవడం మానసిక బలాన్ని, విశాల ఆలోచనలను అందిస్తుంది. సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవడానికి, మానసిక పరిపక్వత సాధించడానికి పుస్తక పఠనం తప్పనిసరి. నేను విభిన్న రకాల పుస్తకాలు చదువుతాను. ఇటీవల కారులో వస్తూ ‘వనవాసి’ అనే పుస్తకాన్ని మళ్లీ చదివాను.

ఇది 1914-1920 కాలంలో కోల్‌కతా సామాజిక పరిస్థితులను చక్కగా వివరిస్తుంది. ప్రతి పుస్తకంలో జీవితానికి సంబంధించిన ఒక అంశం దాగి ఉంటుంది. మెదడు చురుకుగా పనిచేయడానికి, కొత్త ఆలోచనలను రేకెత్తించడానికి పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయి.”

విభిన్న భావజాలాలపై అభిప్రాయం: “నన్ను కొందరు లెఫ్టిస్టు భావాలను వదిలేసిన వ్యక్తిగా చెబుతారు. నేను ఎప్పుడూ లెఫ్టిస్టు కాదు, రైటిస్టూ కాదు. నేను నా ఆలోచనలతో ఎల్లప్పుడూ ఒకేలా ఉంటాను. వామపక్షవాద పుస్తకాలు, జాతీయవాద భావాలు ఉన్న పుస్తకాలు రెండూ చదువుతాను. వామపక్షవాదులతో పరిచయాలు ఉన్నాయి.

జాతీయవాదుల ఆలోచనలనూ అర్థం చేసుకుంటాను. భారతీయ సంస్కృతి, ధర్మం గురించి తెలుసుకోవడం నాకు ఇష్టం. దేశభక్తి విషయంలో నాకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. దేశభక్తి మనలో పుట్టుకతోనే ఉండాలని కోరుకుంటాను.”

‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తకం గురించి: “శ్రీమతి లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రాసిన ఈ పుస్తకం భారతీయ మహిళల శక్తిని అద్భుతంగా చాటుతుంది. మాలతి అనే పాత్రను శక్తిమంతంగా చిత్రీకరించారు. ఆమె రచనా శైలి చదివించేలా, ఆసక్తికరంగా ఉంటుంది. పుస్తకానికి ‘ఆమె సూర్యుడిని కబళించింది’ అనే శీర్షిక ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

భారతీయ సంస్కృతి స్త్రీని గౌరవించడంలో, పూజించడంలో ఎంతో ఉన్నతంగా నిలుస్తుంది. పుస్తకంలో మాలతి, కమలలను పీకా అనే యువకుడు ఏడిపిస్తూ ఉంటాడు, కానీ మాలతి దానికి బలంగా స్పందిస్తూ తన శక్తిని చాటుతుంది. ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ తప్పక చదవాలి.”

స్త్రీ శక్తి,దుర్గాదేవి ఆరాధన: “స్త్రీ శక్తి అన్ని శక్తులకు మూలం. నేను దుర్గాదేవి ఆరాధకుడిని. ఆమె పోరాటానికి ప్రతీక. భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఇచ్చే గౌరవం అత్యున్నతం. ప్రతి దేవుని పేరు ముందు అమ్మవారి పేరును ఉంచుతాం. పురాణాల్లో భాండాసురుడిని సంహరించడానికి లలితా త్రిపురసుందరీ దేవిగా శక్తి స్వరూపిణి అవతరించిన కథ అందరికీ తెలిసిందే.

స్త్రీలలో అంతటి గొప్ప శక్తి ఉంది. అందుకే సృష్టి మొత్తం ఆమె పేరిట ఉందని నమ్ముతాం. జనసేన పార్టీ మహిళా విభాగానికి ‘ఝాన్సీ లక్ష్మీ బాయి’ పేరు పెట్టడం వెనుక పోరాట స్ఫూర్తి ఉంది. మహిళలు సమాజంలో బలమైన మార్పును తీసుకురాగలరు. చిన్నప్పుడు నాకు భయం కలిగినప్పుడు అమ్మ చెప్పిన ధైర్యం నన్ను ఎప్పటికీ ప్రేరేపిస్తుంది. సగటు భారతీయ మహిళలు ఇచ్చే ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది.”

మహిళా సాధికారతపై ఎన్.డి.ఎ. చొరవ: “ఎన్.డి.ఎ. ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకురావడానికి కృషి చేస్తోంది. శ్రీమతి లక్ష్మీ పురి తమ జీవితాన్ని పుస్తక రూపంలో రాస్తే అది ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ పుస్తకం ఆధునిక భారతీయ మహిళా శక్తికి ప్రతీక.”

కార్యక్రమంలో పాల్గొన్నవారు: ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పుస్తక రచయిత్రి శ్రీమతి లక్ష్మీ ముర్డేశ్వర్ పురి, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్, పుస్తక అనువాదకర్త ఎ. కృష్ణారావు, రచయిత్రి శ్రీమతి కుప్పిలి పద్మ, ఎమ్మెస్కో పబ్లిషర్స్ అధినేత విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author