డాల్బీ అట్మోస్ మ్యూజిక్: సంగీతం, ఇన్-కార్ ఎంటర్‌టెయిన్‌మెంట్ భవిష్యత్తుకు కొత్త శక్తి
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 15,2025: సంగీత ప్రపంచంలో మరో విప్లవాత్మక మార్పుకు దారితీస్తూ డాల్బీ అట్మోస్ మ్యూజిక్ తన ప్రత్యేక సాంకేతికతతో కొత్త

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 15,2025: సంగీత ప్రపంచంలో మరో విప్లవాత్మక మార్పుకు దారితీస్తూ డాల్బీ అట్మోస్ మ్యూజిక్ తన ప్రత్యేక సాంకేతికతతో కొత్త శ్రవణానుభూతిని అందిస్తోంది. స్టీరియో పరిమితులను దాటి 3D స్పేస్‌లో ప్రతి శబ్దాన్ని సజీవంగా వినిపించే ఈ సాంకేతికత, సంగీతాన్ని మరింత విశాలంగా, లోతైన భావోద్వేగాలతో అనుభవించేందుకు అవకాశం కల్పిస్తోంది.
స్మార్ట్‌ఫోన్, హెడ్‌ఫోన్, సౌండ్‌బార్ లేదా కారు వంటి ఏ పరికరంలో విన్నా, డాల్బీ అట్మోస్ వినియోగదారుడిని కళాకారుడు ఉద్దేశించిన విధంగా ధ్వనితో చుట్టుముడుస్తుంది. ప్రస్తుతం గానా వంటి ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో డాల్బీ అట్మోస్ మ్యూజిక్ అందుబాటులో ఉండగా, అనేక డాల్బీ-ఎనేబుల్ పరికరాల్లో కూడా సులభంగా ప్లే అవుతోంది.
హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రదర్శన
డాల్బీ అట్మోస్ మ్యూజిక్ ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూపించేందుకు డాల్బీ సంస్థ, ఆదిత్య మ్యూజిక్ మరియు మహీంద్రా సంయుక్తంగా అక్టోబర్ 15న హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. “స్టూడియో నుంచి కారు వరకు” అనే థీమ్‌తో జరిగిన ఈ ప్రదర్శనలో డాల్బీ అట్మోస్ మ్యూజిక్ సృష్టి, అనుభవం, వినిపించే విధానం ఎలా మారిపోతుందో ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో మిత్ర మండలి చిత్రంలోని “జంబర్ గింబర్ లాలా” పాటను ఆర్.ఆర్. ధ్రువన్ స్వరపరచి, డాల్బీ అట్మోస్ ఫార్మాట్‌లో మిక్స్ చేశారు. ఈ గీతాన్ని సినిమాటిక్ వాతావరణంలో,కారులో వినిపించి, డాల్బీ అట్మోస్ విస్తృత శ్రవణ సామర్థ్యాన్ని ప్రేక్షకులకు అనుభవపరిచారు.
దక్షిణ భారత సంగీత పరిశ్రమలో ఆదిత్య మ్యూజిక్ ముందంజలో
దక్షిణ భారత సంగీత రంగంలో అగ్రగామిగా ఉన్న ఆదిత్య మ్యూజిక్, డాల్బీ అట్మోస్‌ను ఫ్యూచర్-రెడీ ఫార్మాట్‌గా స్వీకరించి కొత్త దిశలో అడుగులు వేస్తోంది. సబ్‌స్క్రిప్షన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కళాకారులు, లేబుళ్లు లాభపడే చెల్లింపు పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తూ, ప్రాంతీయ సంగీత ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన వృద్ధికి దోహదపడుతోంది.
తెలుగు, తమిళ భాషల్లో బలమైన స్థాయిని కలిగి ఉన్న ఆదిత్య మ్యూజిక్, పుష్ప చిత్రంలోని “ఊ అంటావా”, “శ్రీవల్లీ”, అల వైకుంఠపురములోలో “బుట్ట బొమ్మ”, డిజె టిల్లు టైటిల్ సాంగ్, గుంటూరు కారంలో “కుర్చీ మడతపెట్టి”, డాకు మహారాజ్లో “దబిడి దిబిడి” వంటి ప్రపంచవ్యాప్తంగా హిట్ అయిన పాటలను అందించింది.

ఇన్-కార్ ఆడియోలో మహీంద్రా నూతన మైలురాయి
మహీంద్రా, అన్ని ధరల వాహనాలలో డాల్బీ అట్మోస్ అనుభవాన్ని అందించిన తొలి గ్లోబల్ ఓఈఎం (OEM)గా చరిత్ర సృష్టించింది. తన 3XO RevX A మోడల్ ద్వారా డాల్బీ అట్మోస్ ప్లేబ్యాక్‌ను ప్రీమియం హార్డ్‌వేర్‌లకే కాకుండా సాధారణ ఆడియో సిస్టమ్‌లలోనూ విస్తరించింది. లీనమయ్యే శబ్ద అనుభవాలను అందించడం ద్వారా ఇన్-కార్ ఎంటర్‌టెయిన్‌మెంట్ రంగంలో కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది.
ఆదిత్య గుప్తా వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య గుప్తా మాట్లాడుతూ, “మేము ఎల్లప్పుడూ సంగీతప్రియులకు అత్యుత్తమమైన అనుభవాన్ని అందించేందుకు సాంకేతికతలో ముందుంటాము. డాల్బీ అట్మోస్ మ్యూజిక్ ద్వారా ప్రతి బీట్, ప్రతి స్వరం కొత్త జీవాన్ని పొందుతుంది. ఇది అభిమానులతో మరింత లోతైన అనుసంధానాన్ని సృష్టిస్తుంది,” అని తెలిపారు.