‘చంద్రేశ్వర’ మూవీ రివ్యూ..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 28, 2025:ప్రస్తుతం ప్రేక్షకులు కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రొటీన్ చిత్రాలను పక్కన పెట్టి, సరికొత్త కథాంశాలతో

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 28, 2025:ప్రస్తుతం ప్రేక్షకులు కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రొటీన్ చిత్రాలను పక్కన పెట్టి, సరికొత్త కథాంశాలతో వస్తున్న సినిమాలను ఆదరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, శివుడు, ఆర్కియాలజీ నేపథ్యంతో, పురాతన ఆలయ రహస్యాల చుట్టూ తిరిగే కథాంశంతో థియేటర్లలోకి వచ్చిన ‘చంద్రేశ్వర’ చిత్రం సినీ ప్రియులలో ఆసక్తిని రేపింది. ‘కన్నప్ప’ వంటి పెద్ద సినిమాకు పోటీగా దిగిన ఈ మూవీ, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? బాక్సాఫీస్ వద్ద విజయం సాధించే సత్తా దీనికి ఉందా? చూద్దాం.

సినిమా: ‘చంద్రేశ్వర’
ట్యాగ్‌లైన్: ‘చంద్రేశ్వర’.. ‘విజయేశ్వర’
విడుదల: జూన్ 27, 2025
నటీనటులు: సురేశ్ రవి, ఆశ వెంకటేష్, నిళల్‌గళ్ రవి తదితరులు
దర్శకత్వం: జీవీ పెరుమాళ్ వర్ధన్
రేటింగ్: 3.25/5

కథ..

నందివర్మ పర్వతం కింద పురాతన కాలం నాటి ఒక గుడి, అందులో నిధి ఉందని తెలిసి, ఆర్కియాలజీ విభాగానికి చెందిన ఎమ్.డి. చక్రవర్తి (నిళల్‌గళ్ రవి) ఒక బృందాన్ని చంద్రగిరి గ్రామానికి పంపిస్తాడు. ప్రొఫెసర్ బోస్ (బోసే రవి) నేతృత్వంలోని ఈ బృందాన్ని గ్రామ ప్రజలు ఊరిలోకి రానివ్వరు. గతంలో ఇలాగే కొందరు వచ్చి చేసిన పనులతో ఊరిలో మరణాలు సంభవించాయని గ్రామస్థులు అడ్డుకుంటారు. వారిని ఒప్పించి, బోస్ బృందం తవ్వకాలు ప్రారంభిస్తుంది.

అయితే, చీకటి పడిన తర్వాత ఆ గ్రామంలో ఎవరూ తిరగకూడదనే నియమం ఉంటుంది, దాన్ని అతిక్రమించిన వారు దారుణంగా చనిపోతుంటారు. సరిగ్గా అదే సమయంలో చంద్రగిరికి సబ్ ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన గురు వర్మ (సురేశ్ రవి), ఈ చావుల వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకోవడానికి తన స్టైల్‌లో దర్యాప్తు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలోనే ఆర్కియాలజీ టీమ్‌లోని అఖిల (ఆశ వెంకటేష్)తో ప్రేమలో పడతాడు. తన ఇన్వెస్టిగేషన్‌లో గురు వర్మ సంచలన విషయాలు తెలుసుకుంటాడు. ఆ విషయాలు ఏంటి? ఆ ఊరిలో చావులకు కారణం ఏంటి? గురు వర్మ ఈ సమస్యను ఎలా పరిష్కరించాడు? నిజంగానే ఆ గ్రామంలో గుడి, అందులో నిధి ఉన్నాయా? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటులు, సాంకేతిక వర్గం పనితీరు..

సురేశ్ రవి సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఆహార్యం బాగుంది. ముఖ్యంగా అతను చేసే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి. ఆర్కియాలజీ టీమ్‌లో కీలక పాత్ర పోషించే అఖిలగా ఆశ వెంకటేష్ మెప్పిస్తుంది. అందంతో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. నిళల్‌గళ్ రవి, బోసే రవి, గ్రామ పెద్ద, ఇతర ఆర్కియాలజీ టీమ్ సభ్యులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

ఇది కూడా చదవండి…ఐటీ సేవల భవిష్యత్తును మలిచేందుకు కోవాసంట్‌కు జాయిన్ అయిన టెక్ దిగ్గజుడు ఫణీష్ మూర్తి

ఇది కూడా చదవండి…యూఎస్‌కు చెందిన అలూకెమ్‌ను $125 మిలియన్లకు కొనుగోలు చేయనున్న హిందాల్కో..

Read This also…PhonePe and HDFC Bank Launch Co-Branded RuPay Credit Card with UPI Integration and Exciting Rewards

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే, ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన హైలైట్. సంగీత దర్శకుడు జెరాడ్ ఫిలిక్స్ సినిమాను ఎత్తుకునే ప్రయత్నం బాగా చేశాడు. శివుడిపై వచ్చే ఒక పాట గూజ్‌బంప్స్ తెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ పురాతన వాతావరణాన్ని అద్భుతంగా చిత్రీకరించింది. ఎడిటింగ్ పరంగా మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలను ఇంకాస్త ట్రిమ్ చేసి ఉండవచ్చు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

దర్శకుడు జీవీ పెరుమాళ్ వర్ధన్ ఈ కథను బాగా రీసెర్చ్ చేసి రాసుకున్నాడని స్పష్టమవుతుంది. సనాతన ధర్మాన్ని టచ్ చేస్తూ, ఎవరినీ బాధపెట్టకుండా కథ చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది.

విశ్లేషణ: అనూహ్య మలుపులు, ఆధ్యాత్మిక అంశాలు

ఆర్కియాలజీ నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చినా, ‘చంద్రేశ్వర’ మాత్రం ఆసక్తికరమైన కథ, స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు కనువిందు కలిగిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశం సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు, ఇది ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. సినిమా ప్రారంభ సన్నివేశం ఒక గొప్ప సినిమా చూడబోతున్నామనే అనుభూతినిస్తుంది. నందివర్మ, విషయ్ గౌడ ఎపిసోడ్ ఈ సినిమాకు బలం. ఈ భాగం మిస్ అయితే కథ అర్థం కాదు.

ఒక రాజుని ఓడించాలంటే వారి ఆచార వ్యవహారాలపై దెబ్బకొట్టాలనే డైలాగ్, సనాతన పద్ధతులను చూపించిన విధానం, హిస్టారికల్ ఎవిడెన్స్ వంటి పదాలు, విగ్రహాల మార్పిడి వంటి అంశాలు దర్శకుడి మేధస్సును తెలియజేస్తాయి. గుడి విశిష్టతను తెలిపే ఎపిసోడ్, అదృశ్య ఖడ్గం, నిధి కోసం అఖిల చెప్పే 4 రహస్య దారులు వంటివన్నీ ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి.

మొత్తంగా, ఈ సినిమాలో కాస్త పేరున్న నటీనటులు ఉండి, ద్వితీయార్థంపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ‘కార్తికేయ 2’ తరహాలో రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉండేది. అయినప్పటికీ, టికెట్ కొనుక్కుని థియేటర్ లోపలికి వెళ్ళిన ప్రేక్షకుడిని ‘చంద్రేశ్వర’ ఏ మాత్రం నిరాశపరచడు. సరైన ప్రమోషన్లు చేసుకుంటే, ఈ ‘చంద్రేశ్వర’ బాక్సాఫీస్ వద్ద ‘విజయేశ్వర’గా మారే అవకాశం ఉంది.

About Author