పవన్ కళ్యాణ్ 100 రోజుల్లో ప్రపంచ రికార్డు సాధన
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆంధ్ర ప్రదేశ్,సెప్టెంబర్ 16,2024: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆంధ్ర ప్రదేశ్,సెప్టెంబర్ 16,2024: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అపారమైన సాదనతో గ్రామ సభల నిర్వహణ ద్వారా ప్రపంచ రికార్డు సాధించింది.

ఆగస్టు 23, 2024న ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీలలో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి రూ.4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు.
ఈ అత్యంత ఘనతను వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించి, సోమవారం ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో రికార్డు పత్రం,మెడల్‌ను వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అధికారిక రికార్డ్స్ మేనేజర్ శ్రీ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందచేశారు.
గ్రామపాలనలో ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో జరిగిన సభలు ప్రపంచంలోనే అత్యంత పెద్ద గ్రామపాలనగా గుర్తించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సందర్భాన్ని ఆనందంతో గుర్తించి, గ్రామ సభల విజయవంతం కోసం భాగస్వాములైన అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

గ్రామ స్వరాజ్యం కోసం కృషి చేస్తున్న Andhra Pradesh ప్రభుత్వం, గ్రామాల అభివృద్ధిపై సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి డైరెక్టర్ కృష్ణ తేజ, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ శ్రీ షణ్ముఖ్, సంయుక్త కమిషనర్ శివప్రసాద్ పాల్గొన్నారు.
గ్రామపాలనలో ప్రజల భాగస్వామ్యం పెంచాలని, గ్రామ అభివృద్ధి కోసం గ్రామ సభల్లో చర్చించి తీర్మానాలు చేసేందుకు ప్రోత్సహించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. మహాత్మా గాంధీ స్ఫూర్తితో, గ్రామ స్వరాజ్యాన్ని ప్రోత్సహిస్తూ, గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది.