సావిత్రీబాయి ఫూలే జీవిత పాఠాలు ప్రతి ఉపాధ్యాయురాలికి స్పూర్తి!

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 3,2024: దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు, ఆడపిల్లల చదువుల కోసం జీవితాన్ని అర్పించిన మహానుభావులు సావిత్రీబాయి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 3,2024: దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు, ఆడపిల్లల చదువుల కోసం జీవితాన్ని అర్పించిన మహానుభావులు సావిత్రీబాయి ఫూలే గారి జయంతి పురస్కరించుకుని “జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం” వేడుకలను భారత చైతన్య యువజన పార్టీ విజయవాడలో ఘనంగా నిర్వహించింది.

లెమన్ ట్రీ హోటల్‌లో పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం, ప్రముఖ నటి, సామాజిక సేవకురాలు రేణు దేశాయ్, జాతీయ బీసీ నేత, ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సూరజ్ మండల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు సావిత్రీబాయి జీవిత పాఠాలను చర్చిస్తూ మహిళా హక్కులు, సమ న్యాయం, విద్య ప్రాధాన్యతపై కీలక సందేశాలు అందించారు.

కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 125 మంది మహిళా ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి బీసీవై పార్టీ తరపున అవార్డులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, సావిత్రీబాయి ఫూలే గారికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి లేఖ రాస్తానని తెలిపారు. ఆడపిల్లలు చదువుకోకూడదనే భావజాలాన్ని ధీటుగా ఎదిరించి, భర్త జ్యోతిరావు ఫూలే సహకారంతో సావిత్రీబాయి మహిళా విద్యకు నాంది పలికారని ప్రశంసించారు.

1890వ దశకంలో దేశాన్ని వణికించిన ప్లేగు వ్యాధి గ్రస్తులకు సేవ చేస్తూ ఆమె కూడా అదే వ్యాధి బారిన పడి మరణించారనే విషయాన్ని రామచంద్ర యాదవ్ ప్రస్తావించారు. మహిళా విద్య, పేదల అభ్యున్నతి, సమానత్వం కోసం ఫూలే దంపతులు చేసిన సేవలు ఎంతో గొప్పవని, ఆ సేవలను గుర్తుచేసుకునే కార్యక్రమాలను ప్రతి సంవత్సరం మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ, “స్త్రీ చదువుకుంటే సమాజాన్ని జయించగలదు” అని వ్యాఖ్యానించారు. సాంఘిక దురాచారాలు నేటికీ కొనసాగుతున్నాయని, అవి నిర్మూలించేందుకు మహిళలు పూర్తిస్థాయిలో విద్యా ప్రాప్తి సాధించాలని సూచించారు. సావిత్రీబాయి ఫూలే జీవితాన్ని ప్రతి ఉపాధ్యాయురాలు ఆదర్శంగా తీసుకుని భవిష్యత్ తరాలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నటి రేణు దేశాయ్ మాట్లాడుతూ, “సావిత్రీబాయి జన్మించిన ప్రాంతంలోనే తాను జన్మించడం గర్వకారణం” అని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచి ఆమె కథలు వింటూ, చదువుతూ పెరిగానని, ఇప్పుడు ఆమె పేరుతో జరుగుతున్న కార్యక్రమంలో మాట్లాడే అవకాశం దొరకడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

సావిత్రీబాయి ఫూలే దేశానికి చూపించిన మార్గం ఎన్నేళ్లైనా చెదిరిపోనిదని, ఆడపిల్లల హక్కుల కోసం పోరాడిన ఆమె సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ గారి సేవలను కొనియాడుతూ, “ఆయన ధన్యజీవి” అని అభివర్ణించారు.

కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు, వారి కుటుంబసభ్యులు హాజరయ్యారు. వారికి ప్రత్యేకంగా మెమొంటోలు, ప్రశంసాపత్రాలు, కిట్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. బీసీవై పార్టీ ప్రతినిధులు, జిల్లా నేతలు, కార్యకర్తలు కూడా ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author