భారత రాజ్యాంగం – మన ఐక్యతకు మూలస్తంభం: పవన్ కళ్యాణ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 26,2024: భారతదేశం అనేక మతాలు, సంప్రదాయాలు, ఆచారాల సమాహారం. ఇంత విభిన్నమైన జీవన

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 26,2024: భారతదేశం అనేక మతాలు, సంప్రదాయాలు, ఆచారాల సమాహారం. ఇంత విభిన్నమైన జీవన విధానం మరెక్కడా కనిపించదు. ఇటువంటి భిన్నత్వంలోనూ “మేమంతా ఒక్కటే” అనే భావనను అలవరచుకొని దేశ ప్రజలందరినీ ఐక్యంగా ఉంచేదే మన రాజ్యాంగమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
భారతీయులందరికీ రాజ్యాంగం పవిత్ర గ్రంథమని, ఇంతటి మహనీయ రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకొని వజ్రోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో దేశ ప్రజలందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా “హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్” నినాదంతో ఉత్సవాలు నిర్వహిస్తున్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు మన రాజ్యాంగం ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టిందని ఆయన అన్నారు. ప్రజలందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పిస్తూ మన రాజ్యాంగం ఆదర్శప్రాయంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ సభకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాయకత్వం వహించారని, ఈ మహనీయ దస్త్రం రూపకల్పనకు 389 మంది విద్యావంతులు తమ మేధోశక్తిని అర్పించారని అన్నారు. రాజ్యాంగ రచన పూర్తయ్యేందుకు 2 సంవత్సరాలు, 11 నెలలు, 18 రోజులు పట్టిందని వివరించారు.

1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందిందని, 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన తర్వాత నుంచి అది దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.
రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని, ఈ దేశ అభివృద్ధి కోసం శక్తిమేర కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.