మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీని త్వరలోనే నెరవేరుస్తాం: హోంమంత్రి వంగలపూడి అనిత
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, జనవరి 3,2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీని త్వరలోనే నెరవేరుస్తామని హోం, విపత్తు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, జనవరి 3,2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీని త్వరలోనే నెరవేరుస్తామని హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బెంగళూరులో పర్యటిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్బంగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధారామయ్య, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి సహా రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైనట్లు హోంమంత్రి స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని విజయవంతంగా అమలుచేస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్యకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేసినట్లు తెలిపారు.

ఏపీ రవాణా శాఖ మంత్రి నేతృత్వంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో కలిసి హోంమంత్రి అనిత బెంగళూరులోని శాంతినగర్ బస్ డిపోను పరిశీలించినట్లు చెప్పారు. అనంతరం, డిపోలో కొత్త బస్సులపై ప్రయాణిస్తూ, అక్కడి ప్రయాణికులతో ముచ్చటించారు. ఈ పథకం ద్వారా మహిళలకు కలిగిన లబ్ధిని వారితో నేరుగా అడిగి తెలుసుకున్నట్లు వివరించారు.
మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఆర్థిక లోటు ఉన్నా ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం కట్టుబడిందని హోంమంత్రి అనిత అన్నారు. సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులో, భవిష్యత్తులో ఎలాంటి లోటుపాట్లు రాకూడదని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు.
కర్ణాటక రవాణా శాఖ ఉన్నతాధికారులతో స్మార్ట్ టికెట్ విధానం గురించి కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ పథకాన్ని అన్ని కోణాలలో పరిశీలిస్తున్నామని, ఉచిత బస్సు ప్రయాణంపై కర్ణాటక రవాణా శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సందేహాలు క్లారిఫై చేసినట్లు హోంమంత్రి చెప్పారు.

ఈ పథకానికి సంబంధించి సమగ్ర నివేదికను త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించనున్నట్లు తెలిపారు.