“ఏలేరు వరదలపై సమీక్ష: ప్రజల రక్షణలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ”
వారాహి డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్,సెప్టెంబర్ 9,2024:రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ సోమవారం మధ్యాహ్నం కాకినాడ

వారాహి డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్,సెప్టెంబర్ 9,2024:రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ సోమవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని జగనన్న కాలనీలో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యల ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:

- “ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై నేను ఎప్పటికప్పుడు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలితో సంప్రదిస్తూ ఉన్నాను. ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశాను.”
- “సుద్ధగడ్డ వాగు సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం చూపడానికి నేను, ఇక్కడి ఎమ్మెల్యేగా, కట్టుబడి ఉన్నాను.”
- “గత ప్రభుత్వం జగనన్న కాలనీల విషయంలో చేసిన తప్పుల వల్ల ప్రజలు నష్టపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మేము ఆ తప్పులను సరిదిద్దాల్సిన అవసరం వచ్చింది.”
- “గొల్లప్రోలులోని జగనన్న కాలనీ స్థలాన్ని లోతట్టు ప్రాంతంలో కొనుగోలు చేశారు. మార్కెట్ ధర రూ. 30 లక్షలు ఉన్న భూమిని రూ. 60 లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు.”
- “ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై నేను ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ, తగిన సూచనలు ఇస్తున్నాను. ప్రజల బాధలు స్వయంగా పరిశీలించడానికి, ఆరోగ్యం సరిగాలేకపోయినా ఈ రోజు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చాను.”
- “గత ప్రభుత్వం సమయంలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. కష్టాల్లో ఉన్న పంచాయతీలను ఆదుకోవడం ఇప్పుడు మా బాధ్యత.”
- “బుడమేరుకు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా వంటి వ్యవస్థకన్నా ముందుగా ఆక్రమణలు చేసిన వారితో చర్చలు జరపాలి.”
- “బుడమేరు ఆక్రమణలు తెలిసో తెలియకో చేసినవారు ఉన్నారు. ఆక్రమణ స్థలం అని తెలియక కొన్నవారు కూడా ఉన్నారు. ముందుగా ఆక్రమణలను గుర్తించి, అందరితో కలిసి మాట్లాడి చర్యలు తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం.”
- “ప్రజల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో కట్టడాలపై చైతన్యం రావాలి.”
- “భారీ వర్షాలు అనుకోకుండా వచ్చిన కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రమంతటా ఈ వర్షాలు ప్రభావం చూపుతున్నాయి.”
- “వరద విపత్తు నుంచి కోలుకోవడానికి విజయవాడకు కొంత సమయం పట్టొచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వరదలు వచ్చినప్పుడు కోలుకోవడానికి సమయం పడుతుంది.”
- “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులను ఆదుకోవడంలో నిద్రలేని రాత్రులు గడుపుతూ పని చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులను అప్రమత్తం చేసి, బాధితులకు తగిన సహాయం అందజేస్తోంది.”