అభిమానుల సంకల్పం వల్లే రక్తదానం కొనసాగుతోంది: మెగాస్టార్ చిరంజీవి
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ , హైదరాబాద్,ఫిబ్రవరి 8,2025: మెగాస్టార్ చిరంజీవి అభిమానుల త్యాగస్వభావం, నిరంతరమైన మద్దతు వల్లే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ , హైదరాబాద్,ఫిబ్రవరి 8,2025: మెగాస్టార్ చిరంజీవి అభిమానుల త్యాగస్వభావం, నిరంతరమైన మద్దతు వల్లే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో రక్తదాన కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. శనివారం ఆయన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ను సందర్శించి మెగా రక్తదాతలను సత్కరించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, “నా చిన్ననాటి మిత్రుడు శంకర్ బ్లడ్ బ్యాంక్ సీఈవోగా, మరొక మిత్రుడు సీజేఎస్ నాయుడు సీఎఫ్‌వోగా సేవలు అందిస్తున్నారు. స్వామి నాయుడు నా బలం. వీరి అంకితభావం వల్లనే ఈ సేవా కార్యక్రమాలు నిరంతరంగా ముందుకు సాగుతున్నాయి.

నా అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానం చేసి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు,” అని అన్నారు.
చిరంజీవి తన అనుభవాలను గుర్తుచేసుకుంటూ, “నాకు అభిమానులుగా యువత ఉన్నారని, వారిని మంచి మార్గంలో నడిపిస్తే గొప్ప సేవ చేయొచ్చని అనుకున్నాను. ఆలోచనతోనే అభిమానులను రక్తదానం చేయాలని ప్రోత్సహించాను.
ఫోటో దిగేందుకు ఆసక్తి చూపే వారందరికీ ముందు రక్తం ఇవ్వాలని షరతు పెట్టాను. అలా మొదలైన ఈ సేవా కార్యక్రమం, నేడు పదే పదే రక్తం ఇచ్చే దాతలతో కొనసాగుతోంది,” అని తెలిపారు.
అలాగే, “నా తర్వాత రామ్ చరణ్ కూడా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించాలని భావిస్తున్నాడు. మంచి చేస్తే తిరిగి మంచే జరుగుతుంది. ఎవరైనా నన్ను విమర్శించినా పట్టించుకోను. నా ధర్మం నిబద్ధతను పాటిస్తాను. రక్తదాతలే నిజమైన దేవుళ్లు. నేను కేవలం వారిని కలుపుకునే వ్యక్తిని మాత్రమే,” అని చిరంజీవి పేర్కొన్నారు.

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడిన అభిమానం గురించి ఓ ఉదాహరణగా చెబుతూ, “ఒకసారి ఓ మహిళ నన్ను విమర్శించిన రాజకీయ నాయకుడిని తీవ్రంగా ప్రశ్నించింది. ఆమె నాకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తి.
కానీ నా బిడ్డ డెంగ్యూ నుంచి బయటపడడానికి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సహాయం చేసిందని, అందుకే నా పట్ల ఉన్న కృతజ్ఞతతో అలా స్పందించిందని చెప్పింది. అప్పుడు నాకు తెలుసైంది, మనం చేసే మంచిని ఎవరూ నిలువరించలేరు,” అని అన్నారు.
చివరగా, “చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మీ ఇంటి లాంటిదే. ఎప్పుడైనా రక్తదానం చేయొచ్చు. మీ ప్రేమ, మద్దతే ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా ముందుకు తీసుకెళ్తోంది,” అంటూ అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.