జవహర్ బాబుపై దాడి… రాష్ట్ర యంత్రాంగంపై జరిగిన దాడిగా భావిస్తాం: ఉప ముఖ్యమంత్రి
‘వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 28,2024: అహంకారం నడి నెత్తికి ఎక్కిన వైసీపీ నాయకులు అధికారులపై దాడులు చేస్తున్నారు. వీళ్లను ప్రశ్నిస్తే ఎవరైనా ఒకటే.. వీరి ఆధిపత్యం

‘వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 28,2024: అహంకారం నడి నెత్తికి ఎక్కిన వైసీపీ నాయకులు అధికారులపై దాడులు చేస్తున్నారు. వీళ్లను ప్రశ్నిస్తే ఎవరైనా ఒకటే.. వీరి ఆధిపత్యం ఒప్పుకోకపోతే ఎవరి మీదనైనా దాడులకు దిగే స్వభావం చూపిస్తార’ని ఉప ముఖ్యమంత్రివర్యులు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
తమను ప్రశ్నించే వాళ్లను, ఎదురు చెప్పే వాళ్లను వైసీపీ నాయకులు దాడి చేసి భయపెట్టడం నైజంగా మార్చుకున్నారని చెప్పారు. ఇలాంటి వారి అహంకారం దించుతాం.. తోలు తీసి కింద కూర్చోబెడతామని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండల ఎంపీడీవో జవహర్ బాబు పై వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డి చేసిన దాడి అధికార యంత్రాంగం మొత్తం మీద చేసిన దాడిగా భావిస్తున్నామని స్పష్టం చేశారు.

శుక్రవారం మధ్యాహ్నం అధికారిక విధుల్లో ఉన్న గాలివీడు మండలం ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డి సుమారు 20 మంది అనుచరులతో వచ్చి కార్యాలయంలోనే దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలు పాలైన జవహర్ బాబుని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో విషయం తెలిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు.
జవహర్ బాబుని కలిసి పరామర్శించేందుకు కడప రిమ్స్ ఆసుపత్రికి శనివారం మధ్యాహ్నం వచ్చారు. చికిత్స పొందుతున్న జవహర్ బాబుఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.జవహర్ బాబు కి పలు ఆరోగ్య సమస్యలు ఉన్న దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని, మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
ఆస్పత్రిలోనే ఉన్న జవహర్ బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.
అనంతరం ఆసుపత్రి బయట మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “విధుల్లో ఉన్న ఎంపీడీవో జవహర్ బాబుపై దాడికి పాల్పడిన వ్యక్తి చట్టం గురించి తెలిసిన వ్యక్తి. గతంలో ఏపీ స్టేట్ లా ప్రాసిక్యూషన్ ఆఫీసర్ గా ఉన్నారు. చట్టాలు గురించి తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా మండలానికి కలెక్టర్ వంటి అధికారి అయిన ఎంపీడీవోపై భౌతిక దాడికి పాల్పడడం అనాగరికం.. హేయం.
సదరు వైసీపీ నాయకుడి అమ్మగారు ఎంపీపీగా పని చేస్తున్నారు. ఆమె ప్రజాప్రతినిధి అయితే ఆమె కార్యాలయ తాళాలు ఆమెకే ఇవ్వాలి. ఆ కార్యాలయ తాళాలు ఇవ్వను అని నిబంధనలు గురించి చెబితే ఎంపీడీఓ జవహర్ బాబుపై తీవ్రంగా దాడి చేయడం అప్రజాస్వామికం.

ఈ దాడి చిన్న విషయం కాదు
రాష్ట్రంలో 640 పైచిలుకు మండలాలు ఉన్నాయి. ప్రతి మండలానికి ఎంపీడీఓ అంటే అభివృద్ధికి బాధ్యత వహించే వ్యక్తి. అలాంటి ఎంపీడీఓపై అహంకారంతో ఇష్టం వచ్చినట్లు దాడి చేయడం ఏమిటి? ఇది ఒక్కరి మీద జరిగిన దాడిగా మేము భావించడం లేదు. రాష్ట్ర యంత్రాంగం మీద జరిగిన దాడిగా భావిస్తున్నాం. ఎంతటి వారు ఉన్న సరే చట్టం ముందుపెడతాం.
చట్టం తెలిసిన వారైనా ఈ విషయంలో ప్రజలకు అధికార యంత్రాంగానికి జవాబు చెప్పి తీరాల్సిందే. ప్రజల కోసం పనిచేస్తున్న అధికారులపై భౌతిక దాడులకు పాల్పడితే వారి ఆత్మస్థైర్యం పూర్తిగా దెబ్బ తింటుంది. భవిష్యత్తులో కూడా బలంగా పని చేయలేరు. అధికార యంత్రాంగాన్ని భయపెట్టాలని భావిస్తే మేం చూస్తూ ఊరుకోం.
11 సీట్లు ఇచ్చినా బుద్ది రాలేదు
వైసీపీ నాయకులను ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన వారి అహంకారం తగ్గలేదు. అహంకారంతో కొట్టుకొని ఈ పరిస్థితికి వచ్చారు.
ప్రస్తుతం ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి చేసిన జల్లా సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తికి దాడులు చేయడం కొత్త కాదు. గతంలో కూడా ఎంపీడీవో గా పనిచేసిన ప్రతాప్ అనే అధికారిపైనా ఇదే జల్లా సుదర్శన్ రెడ్డి దాడి చేశారు. శేఖర్ నాయక్, శ్రీనివాసులు రెడ్డి అనే అధికారులు మీదా దాడి చేశారు. ఇది మా రాజ్యంగం అనుకొని ఇష్టానుసారం అందరి పై దాడులు చేస్తున్నారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే. వీరి ఆధిపత్య అహంకారాన్ని తగ్గించుకోకపోతే ప్రజలే బుద్ది చెబుతారు. వారికి ఎదురు చెబితే దాడి చేస్తున్నారు.

తీవ్రంగా గాయపరిచారు
ఎంపీపీకి మాత్రమే తాళాలు ఇస్తామని చాలా మర్యాదగా, హుందాగా చెప్పిన జవహర్ బాబుపై ఇష్టానుసారం దాడి చేశారు. గడియ వేసి దాడికి తెగబడ్డారు. ఇది క్షమించరాని నేరం.జవహర్ బాబుకి గతంలో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. హైబీపీతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. భౌతికంగా దాడి చేయడమే కాకుండా ఆయన కులాన్ని కూడా దూషించి.. సుదర్శన్ రెడ్డి తన అహంకారాన్ని మరోసారి చూపించారు. వీరి ఆధిపత్యాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై దాడి చేయడం అలవాటుగా మారింది.
ఇది గత ప్రభుత్వం అని, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అనుకుంటున్నట్టు ఉన్నారు. తప్పు జరిగితే చూస్తూ ఊరుకునే వ్యక్తిని కాదు. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నేను తప్పు చేసినా బలంగా శిక్ష పడాలి అని భావించే వ్యక్తిని. అలాంటిది అధికారిక విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై దాడి చేయడం తీవ్రంగా పరిగణిస్తాం. సంఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాం.
అధికారులకు అండగా కూటమి ప్రభుత్వం
ప్రజల కోసం విధులు నిర్వహిస్తున్న అధికార యంత్రాంగంపై దాడులు చేస్తే ఏ మాత్రం సహించేది లేదు. నిబద్ధతగా పనిచేసే అధికారులకు కూటమి ప్రభుత్వం తోడుగా ఉంటుంది. అధికారుల మీద భౌతిక దాడులు పాల్పడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఇలా అహంకారంతో దాడులు చేసే వారికి ఎలాంటి శిక్ష పడాలో అలాంటి శిక్ష పడుతుంది.
ప్రజల విషయాల్లో కూటమి ప్రభుత్వం త్రికరణ శుద్ధిగా పని చేస్తుంది.జవహర్ బాబు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు అని ఇక్కడికి రాలేదు. నేను ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కష్టపడి పని చేసే అధికారులకు ధైర్యం చెప్పడానికి వచ్చాను. విధులు నిర్వర్తిస్తున్న వారిపై ఇష్టానుసారం భౌతిక దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదు.
కేసులో ఉన్న అందర్నీ తప్పనిసరిగా పట్టుకోవాలని తప్పించుకున్న తొమ్మిది మందిని కూడా వెంటనే పట్టుకోవాలని ఎస్పీ కి చెప్పాం. ఈ కేసులో నిందితులందరికీ కౌన్సెలింగ్ ఇచ్చి, చట్టపరంగా శిక్ష పడేలా చూస్తాం.

రాయలసీమ యువతలో చైతన్యం రావాలి
బాధితుడైన ఎంపీడీఓ జవహర్ బాబుభార్య భయపడుతున్నారు. అలాంటి పరిస్థితికి ఇక్కడ ప్రజలను కొందరు తీసుకొని వచ్చారు. ఆ పార్టీ నాయకుడికి సూచిస్తున్నాను… వాళ్ల పార్టీలో ఇలాంటి దౌర్జన్యం చేసే వారిపై దృష్టి పెట్టి సరి చేసుకోవాలి. ప్రజలు ఇలాంటి బెదిరింపులను ఎదిరించి 11 సీట్లు ఇచ్చినా వాళ్ళకి బుద్ది రాలేదు.
రాయలసీమ ప్రజలకు… ముఖ్యంగా యువతకు, మహిళలకు నేను చెబుతున్నది ఒక్కటే. దేనికి, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి దాడులు, దౌర్జన్యాలతో పేట్రిగిపోయినప్పుడు కచ్చితంగా యువత ప్రశ్నించాలి. అవసరమైతే దాడులు చేసే వారికి ఎదురు తిరగాలి. ఓటు వేసేశాం అక్కడితో పని అయిపోయింది అనుకోవద్దు. కచ్చితంగా మార్పు యువత నుంచే రావాలి.
తప్పు చేసేవారు ఎంతటి వారైనా యువత వారిని వదిలిపెట్టదు. ఆఖరికి కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న దళిత అధికారులకు కూడా రక్షణ కరవైంది. వారు ప్రజల కోసం స్వేచ్ఛగా పని చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నాయకులను మళ్లీ మరోసారి ఎన్నికల్లో పాల్గొననీయకుండా యువతే చేయాలి. వారికి 11 సీట్లు ప్రజలు ఇచ్చినా బుద్ధి రాలేదని అర్థమవుతుంది. ఇలాంటి నాయకులు మాకు అక్కర్లేదు అని ప్రజలే బలంగా చెప్పాలి. రాయలసీమ యువతకు అండగా నిలుస్తాం.
అధికారిక ఆధిపత్య అహంకారం ఎదిరించేందుకు సమష్టిగా ఎదుర్కొందాం. అధికారులపై దాడులు చేసే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పక్కా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాం. అధికారులపై భౌతిక దాడులకు పాల్పడే ఎలాంటి వ్యక్తులైన ఊరుకోవద్దని, కచ్చితంగా అధికార యంత్రాంగానికి బలంగా నిలబడాలని చెప్పాం.

ఎంపీడీవో జవహర్ బాబు భార్య కూడా తాము నిస్సహాయులం అని ఏమీ చేయలేమని మళ్లీ బయటకు వస్తే ఎలాంటి దాడులు జరుగుతాయోనని భయపడుతున్నారు. మేం ఆ కుటుంబానికి అండగా నిలుస్తాం. దీనిపై జిల్లా కలెక్టర్ ఎస్పీలకు తగు ఆదేశాలు ఇస్తాం. రాయలసీమలో అహంకారం తలకెక్కి ఆధిపత్యం కోసం ఎంతకైనా తెగించే వారిని చట్టానికి అప్పగిస్తాం.
యువత కూడా చైతన్యవంతులై ఈ దాష్టికాలను ఎదిరించాలి” అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్,పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, కడప జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ తదితరులు పాల్గొన్నారు.