నారాయణగిరి ఉద్యానవనాల్లో దాస సంకీర్తనల గానామృతం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 30,2025: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు బుధవారం సాయంత్రం శ్రీ పురందరదాసుల కీర్తనలతో మారుమోగాయి. శ్రీ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 30,2025: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు బుధవారం సాయంత్రం శ్రీ పురందరదాసుల కీర్తనలతో మారుమోగాయి. శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు వేడుకలు భక్తుల భక్తిరస పారవశ్యంతో సాగాయి.
ముందుగా శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేశారు. సాయంత్రం చల్లని ఈ సుందర వాతావరణంలో నిర్వహించిన ఊంజల్ సేవలో దాస సంకీర్తనల గానం భక్తులను మైమరపింపజేసింది.

టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు. భక్తుల సహస్రధ్వనులతో నారాయణగిరి ప్రాంగణం గంభీరంగా మారింది.
ఈ వేడుకల్లో టిటిడి అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 3,500 మందికి పైగా భజన మండళ్ల సభ్యులు హాజరై భక్తి సంద్రాన్ని తలపించేలా ఈ కార్యక్రమాన్ని మధురంగా మార్చారు.