అక్రమ ఇసుక తవ్వకాలే అన్నమయ్య డ్యాం పాలిట శాపం

ఇసుక దోపిడి కోసమే డ్యాం గేట్లు ఎత్తలేదు
• డ్యాం ప్రమాదానికి ముమ్మాటీకీ మానవ తప్పిదమే కారణం
• నాడు అధికారం లేకున్నా అన్నమయ్య డ్యాం బాధిత ప్రజలకు అండగా నిలిచాం
• అధికారంలోకి వచ్చాక నష్టాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకున్నా..
• మీ కష్టంలో మేమున్నామని భరోసా ఇచ్చేందుకే వచ్చాను
• వరద ప్రభావిత గ్రామాల్లో జాయింట్ కలెక్టర్ తో పున: పరిశీలన
• ఉప ముఖ్యమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో వరద నష్టంపై నివేదిక
• నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం
• అన్నమయ్య డ్యాం వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 24,2024:’అన్నమయ్య డ్యాం ప్రమాదానికి గత ప్రభుత్వంలో ఉన్నవారి ఇసుక దాహమే కారణం. ఇసుక దోచుకునేందుకు డ్యాం గేట్లు ఎత్తకుండా కట్టలు తెగ్గొట్టారు. ప్రజల ప్రాణాలు కోల్పోయేందుకు కారణమయ్యారు.

బాధ్యత వహించేందుకు, నష్టపోయిన బాధితుల కష్టం తీర్చేందుకు మాత్రం ఎవరూ ముందుకు రాలేద’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ ,గ్రామీణాభివృద్ది శాఖమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.

డ్యాం ప్రమాదానికి ముమ్మాటికీ మానవ తప్పిదమే కారణమన్నారు. నాడు అధికారంలో లేకున్నా బాధిత ప్రజలకు అండగా నిలిచామని తెలిపారు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన నాటి నుంచి జనసేన పార్టీ పక్షాన అండగానే నిలిచామన్నారు. అధికారంలోకి రాగానే ఇక్కడ జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

మీ కష్టంలో మేమున్నామని భరోసా ఇచ్చేందు నేను వచ్చానన్నారు. శుక్రవారం సాయంత్రం రాజంపేట నియోజకవర్గం పరిధిలోని అన్నమయ్య డ్యాం వరద ప్రభావిత గ్రామం పులపత్తూరులో పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. అన్నమయ్య డ్యాం వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో ముఖాముఖీ సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “అన్నమయ్య డ్యాం కట్ట తెగి వరద విలయం సృష్టించిన సందర్భంలో పులపత్తూరు గ్రామంతోపాటు మందపల్లి గ్రామం కూడా తీవ్రంగా నష్టం జరిగిన విషయం నా దృష్టికి వచ్చింది. మీకు నిజంగా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నాం కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే మీ దగ్గరకు వచ్చాను. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తాం.

వరద ప్రభావిత గ్రామాలన్నింటిలో జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యటించి నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తున్నాం. ప్రతి గ్రామానికి జాయింట్ కలెక్టర్ వచ్చి నష్టపోయిన ప్రాంతాన్ని పరిశీలించేలా చర్యలు తీసుకుంటాం. జాయింట్ కలెక్టర్ నివేదిక తెప్పించుకుని సాధ్యమైనంత తక్కువ సమయంలో బాధితులకు పరిహారం అందించే ఏర్పాటు చేస్తాం.

ఎన్ని గ్రామాలు నష్టపోయాయి. పొలాలు ఎంత విస్తీర్ణంలో నష్టం జరిగింది. తక్షణం ఎంత సాయం అందించగలం అనే అంశాల మీద అధికారులు నివేదిక రూపొందిస్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుంది.

• ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా అభివృద్ధిలో ముందుకు..

గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయిల పంచాయతీరాజ్ శాఖ నిధులు దారి మళ్లించింది. కేంద్రం నుంచి రూ. 41 వేల కోట్లు వస్తే దానిలో ఖర్చు చేసింది చాలా తక్కువ. మిగిలిన మొత్తం దారి మళ్లించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కటకటలాడుతోంది.

ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో.. కేంద్ర సహకారంతో నిధులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తున్నాం. గత ప్రభుత్వంలో నష్టపోయిన ప్రజలకు అన్ని విధాలా అండగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాము.

• అన్నమయ్య డ్యాం ప్రమాదం ఘటనపై సమగ్ర విచారణ

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం 300 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. దానికి సంబంధించి రూ. 6 కోట్ల పెండింగ్ బిల్లులు సత్వరం విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఇళ్లు కోల్పోయిన వారికి ఐదు సెంట్లు భూమి ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని గత ప్రభుత్వం మాటిచ్చింది. అందులో కొంత మందికి సెంటున్నర మాత్రమే ఇచ్చారు.

ఒకటిన్నర సెంటు వచ్చిన వారికి కూడా ఐదు సెంట్ల భూమి పరిహారం అందేలా చూస్తాం. వరద నష్టం జరగకుండా రక్షణ గోడ నిర్మించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం.

ఎన్ఆర్ఈజీఎస్ కింద భూముల్లో ఇసుక మేటలు తొలగించే ఏర్పాటు చేస్తాం. పంట నష్టానికి పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటాం. వరదల్లో కొట్టుకుపోయిన పోలేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణంపై దేవాదాయశాఖ అధికారులతో చర్చిస్తాం. మానవ తప్పిదమే అన్నమయ్య డ్యాం ప్రమాదానికి కారణం. ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తాం.

అప్పుడు డ్యాం లష్కర్ శ్రీ రామయ్య ప్రమాదాన్ని ముందుగా గుర్తించి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. అధికారులు మారరు. ఆ విషయాన్ని గుర్తెరిగి బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు మంచి చేయాలన్న మనసు మాకు ఉంది.

అది గుర్తించి కొంత మంది దాతలు కూడా ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు ముందుకు వస్తున్నారు. మైసూరువారిపల్లిలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వసతుల కల్పనకు నారాయణ అనే రైతు 10 సెంట్లు స్థలాన్ని ఇచ్చారు. ప్రజలు ఏ సమస్య ఉన్నా అధికారులతోపాటు జనసేన కూటమి పక్షాలైన టీడీపీ, బీజేపీ నాయకుల దృష్టికి తీసుకురండి.

వారు మీకు అండగా ఉంటారు. ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించినా కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. అన్నమయ్య డ్యాం వరద ప్రభావిత ప్రాంత సమస్యల పరిష్కరించేoదుకు ఇక్కడికి వచ్చా. ప్రతి సమస్యను పరిష్కరిస్తాను” అన్నారు.

• అన్నమయ్య డ్యాం ప్రమాదంపై ఫోటో ఎగ్జిబిషన్

అంతకు ముందు అన్నమయ్య డ్యాం ప్రమాదం. వరదల అనంతరం గ్రామాల్లో పరిస్థితులు. ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న పరిస్థితులు. ప్రస్తుతం డ్యాం వద్ద ఉన్న పరిస్థితులను వివరిస్తూ నీటిపారుదల, ఆర్ అండ్ బీ, సర్వే, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ గారికి గ్యాలరీ ద్వారా ప్రమాదాన్ని వివరించారు.

• పులపత్తూరు గ్రామంలో కాలి నడకన..

అన్నమయ్య డ్యాం వరద బాధిత గ్రామాల ప్రజలతో ముఖాముఖి అనంతరం పులపత్తూరు గ్రామంలో వరద ప్రభావిత ప్రదేశాన్ని పవన్ కళ్యాణ్ గారు కాలి నడకన వెళ్లి పరిశీలించారు. అధికారులు వరద ఎలా వచ్చింది? నీరు ఎక్కడ వరకు వచ్చింది? అనే అంశాలనుపవన్ కళ్యాణ్ గారికి వివరించారు.

• సర్వం కోల్పోయాం.. మీరే మాకు దిక్కు..

అంతకు ముందు పులపత్తూరు, మందపల్లి, తోగూరు పేట తదితర వరద ప్రభావిత గ్రామాల ప్రజల పవన్ కళ్యాణ్ గారి ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. అర్థరాత్రి వరద వచ్చి మా గ్రామాలను ముంచేసింది. 2020లో అన్నమయ్య డ్యాం కట్టలు తెగి ఊళ్లను ముంచెత్తింది. పంటలు నష్టపోయాం. పశువులు పోయాయి.

ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. ఏ అధికారి మాకు సాయం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మాకు న్యాయం చేస్తారన్న ఆశతో ఇక్కడికి వచ్చామని మందపల్లికి చెందిన శ్రీమతి రామన్నగారి రజనీ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల తప్పిదం వల్లే అన్నమయ్య డ్యాం ప్రమాదం జరిగింది. వరద ముంచెత్తి సర్వస్వం కోల్పోయాం. గత ప్రభుత్వం వ్యవసాయ, డ్వాక్రా, బంగారం మీద తీసుకున్న రుణాలు రద్దు చేస్తామని ప్రకటించింది. డ్వాక్రా రుణాలు మాత్రమే మాఫీ చేసి వదిలేసింది. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం ఇళ్లలో బురద కడుక్కోవడానికి కూడా సరిపోలేదు. అంటూ పవన్ కళ్యాణ్ గారి ఎదుట బాధితులు వాపోయారు.

ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు అరవ శ్రీధర్, ఆరణి శ్రీనివాసులు, పంచాయతీరాజ్ ,గ్రామీణాభివృద్ధి డైరెక్టర్ కృష్ణతేజ, అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీవి. విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, సబ్ కలెక్టర్లు శ్రీమతి నిదియా దేవి, శ్రీ మేఘ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

About Author