టీసీఎస్ ఇన్‌క్విజిటివ్ 2024 హైదరాబాద్ ఎడిషన్‌లో విజేతలుగా నిల్చిన భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్, ఆగా ఖాన్ అకాడెమీ విద్యార్థులు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగస్టు 14,2024: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) (BSE: 532540, NSE: TCS) హైదరాబాద్‌లో నిర్వహించిన వార్షిక ఫ్లాగ్‌షిప్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగస్టు 14,2024: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) (BSE: 532540, NSE: TCS) హైదరాబాద్‌లో నిర్వహించిన వార్షిక ఫ్లాగ్‌షిప్ క్విజ్ పోటీ, టీసీఎస్ ఇన్‌క్విజిటివ్ (TCS InQuizitive)లో 55 పాఠశాలల నుంచి 400 మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు. 8 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహించబడిన ఈ పోటీ నగర విద్యార్థుల మేథో శక్తిసామర్థ్యాలను చాటి చెప్పింది.
హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రాంతీయ ఫైనల్ క్విజింగ్ అయిదు రౌండ్ల పాటు తీవ్రమైన పోటీతో సాగింది. ఇందులో జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్‌కి చెందిన అనిమేష్ పాణిగ్రాహి (15) విజేతగా నిలవగా, ఆగా ఖాన్ అకాడెమీకి చెందిన ప్రియాంశు నందిగామ (16) రన్నరప్‌గా నిల్చారు. ఈ ఇద్దరు విద్యార్థులు ఇక నేషనల్ ఫైనల్స్‌లో హైదరాబాద్‌కి ప్రాతినిధ్యం వహిస్తారు. దేశవ్యాప్తంగా 11 ప్రాంతీయ రౌండ్లలో గెలుపొందిన ఛాంపియన్లతో పోటీపడతారు. గౌరవ అతిథులు టీసీఎస్ ప్రెసిడెంట్ (టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్) శ్రీ వి. రాజన్న, టీసీఎస్ హైదరాబాద్ సెంటర్ హెడ్ శ్రీ చల్లా నాగ్ బహుమతులను అందించారు.

“టీసీఎస్ ఇన్‌క్విజిటివ్ పోటీలు తిరిగి వాస్తవ రూపంలో, ఇన్-పర్సన్ విధానంలో నిర్వహించబడటం చూస్తే సంతోషంగా ఉంది. దాదాపు రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో టీసీఎస్ ఇన్‌క్విజిటివ్ ప్రస్థానంలో నేను భాగంగా ఉన్నాను. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం విద్యార్థుల సమాధానాలు మెరుగుపడటం, మరింత హత్తుకునే విధంగా, విజ్ఞానాన్ని పెంచే విధంగా ఉండటాన్ని నేను గమనించాను. టీసీఎస్ ఇన్‌క్విజిటివ్ ఇకపై కూడా విద్యార్థులను ఆకట్టుకునే విధంగా ఉండగలదని, కంప్యూటింగ్‌లో పురోగతిని ఏటా వారికి మరింత చేరువ చేయగలదని నేను విశ్వసిస్తున్నాను” అని టీసీఎస్ ప్రెసిడెంట్ (టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్) వి. రాజన్న తెలిపారు.
“నిర్దిష్ట విలువల పునాదిపై నిర్మించబడి, నిర్వహించబడేది ఏదైనా చిరకాలం స్థిరంగా కొనసాగుతుంది. టీసీఎస్ ఇన్‌క్విజిటివ్ మూలాలు లీడర్‌షిప్, ఎక్సలెన్స్, లెర్నింగ్ అనే మా ప్రధాన విలువల్లో ఉన్నాయి. అందుకే ప్రారంభమై 25 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఇది ఆదరణ పొందుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు ఇటువంటి జాతీయ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొనేలా తమ విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఈ ప్రాంత పాఠశాలల యాజమాన్యాలకు మా కృతజ్ఞతలు” అని టీసీఎస్ హైదరాబాద్ సెంటర్ హెడ్ చల్లా నాగ్ తెలిపారు.

టీసీఎస్ ఇన్‌క్విజిటివ్ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్, స్పోర్ట్స్, ఇంజినీరింగ్ మరియు కళలు వంటి రంగాలపై విద్యార్థుల్లో ఆసక్తి కలిగించేందుకు, అవగాహన పెంచేందుకు రూపొందించిన ఒక వినూత్నమైన లెర్నింగ్ కార్యక్రమం.