ఏలేరు వరదలపై సమీక్ష చేపట్టిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
వారాహి డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్,సెప్టెంబర్ 9,2024:ఏలేరు రిజర్వాయర్ లో జల ప్రవాహం పెరుగుతుండటం, వర్షాల కారణంగా వరద
వారాహి డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్,సెప్టెంబర్ 9,2024:ఏలేరు రిజర్వాయర్ లో జల ప్రవాహం పెరుగుతుండటం, వర్షాల కారణంగా వరద ముప్పు పొంచి ఉండటంతో, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వరద ప్రభావిత గ్రామాల పరిస్థితులను సమీక్షించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్, ఇతర అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు.
ఆదివారం ఉదయం నుంచి పలు దఫాలుగా అధికారులతో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ఏలేరు రిజర్వాయర్ 24 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉండగా, ఇప్పటికే 21 టీఎంసీలకు చేరినందున, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, విద్యుత్ శాఖల అధికారులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉప్పాడ ప్రాంత ప్రజల కోసం తగిన సహాయక చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్, ఏలేరు రిజర్వాయర్ ఇన్ఫ్లో ఉదయం 4 వేలు క్యూసెక్కులుగా ఉండగా, సాయంత్రానికి అది 8 వేలు క్యూసెక్కులకు చేరిందని తెలిపారు.
రాత్రికి 10 వేలు క్యూసెక్కులు చేరుతాయని అంచనా వేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని జగనన్న కాలనీ, సూరంపేట కాలనీ, కోలంక, మాదాపురం, నవఖండ్రవాడ ప్రాంతాలు వరద ముంపు ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని, యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని కలెక్టర్ తెలియజేశారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం కాకినాడ చేరుకుని, కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఏలేరు వరద ముప్పు నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను స్వయంగా పరిశీలించనున్నారు.