ప్రజా సంక్షేమం కోసం జిల్లాల పర్యటనలు చేపట్టే పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 30,2024: సమస్యలను స్వయంగా చూసి, క్షేత్రస్థాయిలో జరిగే అవినీతి, అక్రమాలను వాస్తవంగా పరిశీలించినప్పుడే ప్రజా సమస్యల

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 30,2024: సమస్యలను స్వయంగా చూసి, క్షేత్రస్థాయిలో జరిగే అవినీతి, అక్రమాలను వాస్తవంగా పరిశీలించినప్పుడే ప్రజా సమస్యల అసలు లోతు తెలుస్తుంది. బాధితులు ఫిర్యాదు రూపంలో లేదా నోటిమాటగా చెప్పినదాని కంటే వాటిని ప్రత్యక్షంగా తెలుసుకున్నపుడు, క్షేత్రస్థాయికి వెళ్లి చూసినపుడు అసలు స్వరూపం కనిపిస్తుంద’ని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తే చెప్పులతో నడిచే పరిస్థితులు కూడా లేక బురదలో వెళ్లాల్సి వచ్చింది… నేను నడిచి చూపిస్తే క్షేత్ర స్థాయిలో అధికారులు కూడా అంతే బాధ్యతగా పనిచేస్తారనిపించిందన్నారు. రాష్ట్రంలో ఇంకా అనేక ప్రాంతాల్లోని సమస్యలు, అక్కడి ఇబ్బందులను తెలుసుకొనేందుకు నేను నా పేషీతో సహా జిల్లాల్లో కూర్చోవడం అవసరం అనిపించిందని పేర్కొన్నారు.

ఇందుకోసం నెలలో 14 రోజులు జిల్లాల్లో పర్యటనలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో ఉంటేనే ప్రజల సమస్యలను నేరుగా అర్ధం చేసుకొని, వాటికి సత్వర పరిష్కారం చూపగలనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిద్వారా అధికార యంత్రాంగం పనిలో నాణ్యత ఉండాలని కోరుకుంటున్నానని పునరుద్ఘాటించారు.

సోమవారం ఉదయం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సూటిగా స్పందించారు.

ఆరునెలల్లో పాలనా విషయాలపై పట్టు
“నేను ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే మనిషిని. వీధుల్లో తిరగడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు కార్యాలయంలో కూర్చుని పని చేయడం అలవాటు చేసుకుంటున్నాను. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల కాలంలో పరిపాలన గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఉన్న ఇబ్బందులు తెలుసుకున్నాను.

ఆఫీసుల్లో కూర్చుని సమస్యలకు పరిష్కారాలు వెతకలేము. నేను ఎక్కువ ప్రజల్లో తిరిగి ప్రతి సమస్యను అర్ధం చేసుకోవడం వల్ల పాలనా అనుభవం లేకపోయినా పరిష్కారాలు వెతకడం తేలిక అయ్యింది. ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నా, వాటి పరిష్కార మార్గాలు వెతకాలన్నా ప్రజల మధ్యకే వెళ్లాలి. ప్రజలే తమ సమస్యకు పరిష్కార మార్గాలు కూడా చూపుతారు. అధికారిక వ్యవహారాలకు సంబంధించిన భాష కూడా అర్థమైంది.”

ఒక దాని వెంటే 100 సమస్యలు
2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 2014లో పార్టీ స్థాపించాను. సుమారు దశాబ్దన్నర కాలం ప్రజా జీవితంలో ఉన్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఉన్న సమయం సరిపోవడం లేదు. ఒక సమస్య పరిష్కారం చేసేలోపు వంద దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి. మన దగ్గరకు వచ్చే సమస్యలను పరిశీలించి బాధితుల వేదన తీర్చాలని ప్రయత్నిస్తున్నా.

రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలు గ్రామాల్లోనే ఉంటారు. నా శాఖల ద్వారా ఎక్కువ అభివృద్ధి చేయవచ్చు. క్షేత్ర స్థాయి పర్యటనల వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మొన్న గాలివీడులో ఎంపీడీఓ మీద దాడి జరిగినప్పుడు కడప, అన్నమయ్య జిల్లాలో పర్యటించాల్సి వచ్చింది. కేవలం అధికారుల మీదనే కాదు.. క్లాస్ ఫోర్ ఉద్యోగి మీద దాడి జరిగినా నా స్పందన అలాగే ఉంటుంది.

అధికారుల్లో స్పందించే గుణం తగ్గిపోయింది
సినిమా, రాజకీయాలు ఇప్పుడు నా జీవితం లో భాగం అయిపోయాయి. సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. నాకు ఇప్పుడు అసలు సమయం దొరకడం లేదు. నేను 365 రోజులు పని చేయడానికి సిద్ధమే… అయితే శని, ఆదివారాలు కూడా క్షేత్ర స్థాయిలో పని అంటే ఉద్యోగులు ఇబ్బందులుపడతారన్న ఆలోచన ఉంది.

పనిలో నాణ్యత రావాలి అంటే సెలవులు తీసుకోవచ్చు. గత ప్రభుత్వ తీరు వల్ల అధికారుల్లో స్పందించే గుణం తగ్గిపోయింది. జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ యువకుడు బ్రెయిన్ డెడ్ అయ్యారు. అంత బాధలోనూ ఆ యువకుడి అవయవాలు దానం చేశారు. ప్రమాదానికి కారణమైనవారిపై చర్యలు కోరుతూ పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన మృతుల కుటుంబ సభ్యులపై పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదు.

ఈ విషయం మా కార్యాలయం దృష్టికి వస్తే జిల్లా ఎస్పీతో మాట్లాడితే ఆయన కూడా మానవత్వంతో స్పందించలేదు. పాలనలో మానవీయత ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. అధికారులు, పోలీసులు ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించాలి.

కార్యనిర్వాహక వ్యవస్థను అట్టడుగుకు దిగజార్చారు

ముఖ్యమంత్రి తరచూ మానవతాదృక్పథంతో పని చేయాలని చెబుతారు. మానవతాదృక్పథం లేని ప్రభుత్వం ఉండి ఏం లాభం? గత ఐదేళ్లలో బ్యూరోక్రసీ అట్టడుగుకు దిగజారిందని కేంద్రం నుంచి ఓ అధ్యయన నివేదిక వచ్చింది. గతంలో ప్రతి శుక్రవారం, శనివారం నిర్మాణంలో ఉన్న రోడ్ల నాణ్యతను అధికారులు పరిశీలించే వారు. గత ఐదేళ్లలో అది కూడా జరగలేదు.

కూటమి ప్రభుత్వంలో పారదర్శకత పాటించాం
అధికార యంత్రాంగాన్ని పటిష్టపరచడంతోపాటు వారి సమస్యలపై కూడా దృష్టి సారించాలన్నది మా ఉద్దేశం. అధికారుల మీద దాడి జరిగితే మనోస్థైర్యం నింపడానికి కడప వెళ్లాను. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అవినీతి లేకుండా బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చాం. కొంత మంది అధికారులు ఆర్డర్ వచ్చాక మాదేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జాబితా చూసిన తర్వాత మెరిట్ ఆధారంగా వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం గొప్పగా పని చేస్తుంది.
గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను చిందరవందర చేశారు. తప్పు జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారని కలెక్టర్ల సమావేశంలో అడిగితే ఎవరూ నోరు మెదపలేకపోయారు.
ఆరు నెలల పాలన బేరీజు వేయండి
గత ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి ఆరు నెలల పాలనతో మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలల పాలన బేరీజు వేయండి. ఆర్థికపరంగా ఇబ్బందులు ఉన్నాయి. పక్కాగా యంత్రాంగాన్ని నిర్లక్ష్యం చేశారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని నలిపేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి వరకు తీసుకువచ్చామంటే గొప్ప విషయం. నెలలో ఒకటో తేదీన జీతాలు ఇవ్వగలుగుతున్నాం. సామాజిక పింఛన్లు సమయానికి ఇవ్వగలుగుతున్నాం. గత ప్రభుత్వ కుంభకోణాలు బయటపెట్టాం. వైసీపీ ఆరు నెలలతో పోలిస్తే కూటమి ప్రభుత్వానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది.

About Author