తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 28,2025: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 4న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని కోయిల్ ఆళ్వార్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 28,2025: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 4న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం ఘనంగా నిర్వహించబడింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, ఉదయం 6 నుండి 9 గంటల మధ్య కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ప్రారంభమైంది.

ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులన్నిటిని నీటితో శుద్ధి చేశారు. అనంతరం పవిత్రజలంతో ప్రోక్షణం చేసి, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలను కలిపి ఆలయానికి ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం అందించారు.

అలాగే, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ప్రతి ఏడాది నాలుగు సార్లు నిర్వహించనుంది. ఇవి రథసప్తమి, పవిత్రోత్సవాలు, వసంతోత్సవాలు, బ్రహ్మోత్సవాలకు ముందుగా జరుపబడతాయి.

8 పరదాలు అమ్మవారికి బహుకరణ

హైదరాబాద్‌కి చెందిన శ్రీ వెంకట రామ ప్రసాద్ శర్మ దంపతులు మంగళవారం 8 పరదాలను శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బహుకరించారు. ఈ పరదాలను డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, అర్చకులు శ్రీ బాబు స్వామికి అందజేశారు. అమ్మవారి గర్భాలయంలో ఈ పరదాలు అలంకరిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేశ్, ఆలయ ఇన్పెక్టర్లు చలపతి, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 4న రథసప్తమి

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు ప్రారంభమవుతాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై ఊరేగనున్నారు. సాయంత్రం 3.30 నుంచి 4.30 గంటల మధ్య స్నపనతిరుమంజనం నిర్వహించబడుతుంది. సాయంత్రం 6 – 7 గంటల మధ్య చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు గజ వాహనాలను అధిష్టించి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

రథసప్తమి సందర్భంగా ఫిబ్రవరి 4న ఆలయంలో నిర్వహించబడే ఆర్జిత కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఊంజల్ సేవ, వేదాశీర్వచనం సేవలు, బ్రేక్ దర్శనాన్ని రద్దు చేయడం జరిగినది.

శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో, ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.

About Author