ఊరూరా విజయవంతంగా సాగుతున్న గ్రామ సభలు..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 23,2024:శుక్రవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పండగ వాతావరణం కనిపించింది.
•13,326 పంచాయతీల్లో ఒకే రోజు మొదలైన గ్రామ సభలు
•రికార్డు స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికిపైగా ప్రజలు పాల్గొని ఉపాధి పనులకు ఆమోదం
•రూ.4,500 కోట్ల విలువైన పనులకు ప్రజలే తీర్మానాలు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 23,2024:శుక్రవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పండగ వాతావరణం కనిపించింది. 13,326 పంచాయతీల్లో ఉదయం నుంచి గ్రామ సభలు విజయవంతంగా నడుస్తున్నాయి.
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో ఈ రోజు మధ్యాహ్నం పాల్గొనబోతున్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ గారు ఉదయం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరివారిపల్లె పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.38.46 లక్షల విలువైన 43 పనులకు ఆమోదం తెలిపారు.
•ప్రజాస్వామ్య స్ఫూర్తితో… పారదర్శకతతో…
పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో ఒకే రోజు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా ప్రతి గ్రామంలో సభలు మొదలుపెట్టారు. వీటిలో కోటి మందికిపైగా ప్రజలు పాల్గొన్నారు.
తమ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులకు తీర్మానాలు చేసుకొని ఆమోదించుకున్నారు. రూ.4500 కోట్లు విలువైన పనులకు నేటి గ్రామ సభల్లో ఆమోదం లభించింది.
ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో కోటి మందికిపైగా ప్రజలు భాగస్వామ్యంతో రూ.4,500 కోట్లు విలువైన పనులకు ఆమోదం చేసుకోవడం ప్రపంచ స్థాయి రికార్డుగా నిలుస్తుంది.
నేటి గ్రామ సభల ద్వారా 87 రకాలైన పనులకు ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టేందుకు అవకాశం లభించింది. 9 కోట్ల పని దినాలతో, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన జరుగుతుంది.
పంచాయతీ పరిధిలోని వారంతా కూర్చొని గ్రామాభివృద్ధి మీద నిర్ణయాలు తీసుకొనేలా, ప్రజాస్వామ్య స్ఫూర్తితో, పారదర్శకంగా నిధులు వెచ్చించుకొనేలా గ్రామ సభలను నిర్వహిస్తున్నారు.