రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం: పవన్ కళ్యాణ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 26,2024: జల జీవన్ మిషన్ (జె.జె.ఎం) పథకం అసలైన స్ఫూర్తిని సాధించాలంటే, బోరు బావుల మీద

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 26,2024: జల జీవన్ మిషన్ (జె.జె.ఎం) పథకం అసలైన స్ఫూర్తిని సాధించాలంటే, బోరు బావుల మీద ఎక్కువగా ఆధారపడకుండా, దీర్ఘకాలికంగా స్థిరంగా ఉండే వనరుల నుంచి నీటిని సేకరించడం అత్యంత ముఖ్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
మంగళవారం నాడు ఆయన ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జల జీవన్ మిషన్ అమలుపై వివరణ ఇచ్చారు.

జె.జె.ఎం సర్వే విశేషాలు:
- 2019-2024 మధ్య అందించిన నీటి కనెక్షన్లలో పలు సమస్యలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు.
- సర్వే ప్రకారం 29.79 లక్షల కుటుంబాలకు ఇప్పటికీ ట్యాప్ కనెక్షన్లు అందలేదని వెల్లడించారు.
- 2.27 లక్షల పంపులు పనిచేయడం లేదని, 0.24 లక్షల ట్యాపులు సరిపడినంత నీటిని సరఫరా చేయడం లేదని వివరించారు.
- ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల నీరు అందించాలన్న లక్ష్యం ఇంకా పూర్తి కాలేదని తెలిపారు.

కేంద్రం సహకారం అవసరం:
జె.జె.ఎం పథకం విజయవంతంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించగలమని, ఇందుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అవసరమని ఉప ముఖ్యమంత్రివర్యులు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామీణ గృహాలకు సురక్షితమైన తాగునీరు అందించడానికి అవసరమైన నిధులపై కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
జె.జె.ఎం స్ఫూర్తిని నిలబెట్టి, లక్షలాది గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పవన్ కళ్యాణ్ వివరించారు.