ఎసెన్షియా సంస్థలో ఘోర ప్రమాదంపై అధికారులతో చర్చించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 22,2024: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో జరిగిన ఘోర ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 22,2024: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో జరిగిన ఘోర ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అధికారులతో చర్చించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇటువంటి కర్మాగారాల్లో భద్రతను డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబర్, ఫైర్, కేంద్ర ప్రభుత్వ ఆధ్యర్యంలో ఉండే పెట్రోలియం అండ్ ఎక్స్ ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తాయి.

కాలుష్య నియంత్రణ మండలి మాత్రం నిబంధనల అతిక్రమణ జరిగిందా? అంతా సక్రమంగానే ఉన్నాయా అనే విషయాన్ని పర్యవేక్షిస్తుంది. ప్రమాదం వైఫల్యానికి ఎవరు బాధ్యులు అనే విషయమై ఉప ముఖ్యమంత్రివర్యులు ఆరా తీశారు. ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రై. లిమిటెడ్ పేరిట కొనసాగుతున్న ఈ రసాయనిక కర్మాగారానికి ఇద్దరు యజమానులు ఉన్నారు.

ఈ యజమానులు ఇద్దరి మధ్యన విబేధాలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలియచేశారు. రియాక్టర్ పేలి ఈ ప్రమాదం సంభవించిందని బయటకి ప్రచారం జరుగుతున్నా సాల్వెంట్ ఆయిల్ ను ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకు పంప్ చేసే క్రమంలో లీకై మంటలు చెలరేగాయని అనంతరం పెద్ద పేలుడుతో ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.


ప్రమాద ప్రాంతాన్ని స్వయంగా వచ్చి పరిశీలించి క్షతగాత్రులను పరామర్శించడానికి రావడానికి ఉప ముఖ్యమంత్రి సంసిద్ధత వ్యక్తం చేసినా సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందన్న అధికారుల సూచనతో ఆ యోచనను తాత్కాలికంగా విరమించుకున్నారు.

భారీ స్థాయిలో ప్రమాదం జరగడం 16 మంది ప్రాణాలు కోల్పోవడం, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడడం తీవ్రంగా కలచివేసిందని పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రితో జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాట్లాడారు.


ఒకే ప్రాంతంలో తరచూ ఇటువంటి ప్రమాద ఘటనలు జరుగుతుండటంతో సేఫ్టీ ఆడిట్‌ ప్రాముఖ్యతపై అధికారులకు సూచనలు చేశారు. ఫ్యాక్టరీలు, అగ్నిమాపక శాఖ, పెట్రోలియం మరియు పేలుడు పదార్థాల భద్రతా సంస్థ, కార్మిక శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించి సేఫ్టీ ఆడిట్ చేపట్టి భద్రత ప్రమాణాలు, నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు.

About Author