గ్రామ పంచాయతీ సేవల సమగ్రత కోసం క్లస్టర్ గ్రేడ్ల విభజనలో మార్పులు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 20,2025: గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందించేందుకు, సిబ్బంది కొరత సమస్యను

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 20,2025: గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందించేందుకు, సిబ్బంది కొరత సమస్యను అధిగమించాలన్న సంకల్పంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చారు.
పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు తీసుకుని, కొత్త మార్గదర్శకాలను రూపొందించాలనే ఆదేశాలను ఇచ్చారు.
పూర్వం పంచాయతీల ఆదాయంపై ఆధారపడి క్లస్టర్ గ్రేడ్ల విభజన జరిగితే, ఇప్పుడు జనం సంఖ్య ఆధారంగా కూడా గ్రామ పంచాయతీ క్లస్టర్లను విభజించాలని సూచించారు. అదేవిధంగా, సిబ్బంది నియామకంలో హెచ్చుతగ్గులు లేకుండా, గ్రామ పంచాయతీలలో ప్రజలకు నిరంతరాయంగా సేవలు అందించాలని కోరారు.

ఈ మేరకు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పాత క్లస్టర్ విధానంలో, ఆదాయం ఎక్కువగా ఉన్న పంచాయతీలలో జనాభా తక్కువగా ఉండడం, ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీలలో జనాభా ఎక్కువగా ఉండడం వలన సిబ్బంది నియామకంలో తలెత్తుతున్న ఇబ్బందులను ఈ సమీక్షలో ప్రస్తావించారు.
గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసి, కొత్త క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానంలో సిబ్బందిని నియమించుకోవడం పై చర్చించారు. ఈ విధానం ద్వారా మౌలిక వసతులు కల్పించడం, సంక్షేమ పథకాలు అమలు చేయడం, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం, గ్రామ పంచాయతీ ప్రధాన బాధ్యతలు అయిన తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య మెరుగుదల వంటి పనులకుగాను తగినంత మంది సిబ్బంది ఉంటారని, వీటిపై అధ్యయనం చేసి పంచాయతీలలో పరిపాలనను సులభతరం చేసేందుకు అవసరమైన సిఫార్సులు చేసే కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

కొత్త క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటవుతుంది. జిల్లా యూనిట్ ప్రాతిపదికన, 26 జిల్లాల్లో పంచాయతీల ఆదాయం, జనాభాను ఆధారంగా, జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదికల ఆధారంగా పంచాయతీ క్లస్టర్ గ్రేడ్లను ప్రభుత్వానికి నివేదించడానికి రాష్ట్ర కమిటీ పని చేస్తుంది.