SEEDAP ద్వారా మైనార్టీ యువతకు ఉచిత పారిశ్రామిక శిక్షణకు దరఖాస్తు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, డిసెంబరు 27,2024: రాష్ట్ర ప్రభుత్వాధ్వర్యంలో సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, డిసెంబరు 27,2024: రాష్ట్ర ప్రభుత్వాధ్వర్యంలో సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (SEEDAP) నిర్వహించనున్న పారిశ్రామిక రంగంలో ఉపాధి, స్వయం ఉపాధికి సంబంధించిన ఉచిత శిక్షణకు రాష్ట్రంలోని మైనార్టీ యువత దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు.
పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించడానికి, అవసరమైన సహాయాన్ని అందించడానికి, పరిశ్రమ ఆధారిత నైపుణ్యాలతో యువతను సాధికారికులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా SEEDAP, నిరుద్యోగ యువతకు వివిధ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది.

ముఖ్యంగా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన యువతను పరిశ్రమ యజమానులతో అనుసంధానించడం జరుగుతుంది. పరిశ్రమల అవసరాలకు సరిపోలని నైపుణ్యాలు ఉన్న యువతకు SEEDAP ఉచిత రెసిడెన్షియల్ శిక్షణను అందించి, స్కిల్ గ్యాప్‌ని భర్తీ చేస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు.
ఉచిత శిక్షణలో రవాణా, కెరీర్ కౌన్సెలింగ్, యూనిఫాం, వసతి, ఆహారం, స్టడీ మెటీరియల్, ఉద్యోగ శిక్షణ, ఎన్.ఎస్.డి.సి ద్వారా సర్టిఫికేషన్, ఉద్యోగ నియామకాలు,పోస్ట్ జాబ్ ప్లేస్ మెంట్ కు మద్దతు కూడా అందిస్తారని మంత్రి చెప్పారు.
రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లోని మైనార్టీ సంక్షేమ/ఫైనాన్స్ కార్యాలయాల్లో మైనార్టీ యువత ఈ శిక్షణ కోసం తమ దరఖాస్తులను (బయోడేటా) సమర్పించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూక్ కోరారు.