వికసిత భారతంలో ఆంధ్రప్రదేశ్ చిరునవ్వులు విరబూయాలి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 13,2024: ‘రాష్ట్రంలోని కొన్ని గిరిజన గ్రామాల్లో సకాలంలో వైద్య సదుపాయం అందక, డోలీల్లో రోగులను,

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 13,2024: ‘రాష్ట్రంలోని కొన్ని గిరిజన గ్రామాల్లో సకాలంలో వైద్య సదుపాయం అందక, డోలీల్లో రోగులను, బాలింతలను తీసుకొచ్చే పరిస్థితి ఉండటం బాధాకరం. ఇటీవల కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో ఇలాంటి గ్రామాలు 2854 ఉన్నాయని అధికారులు చెప్పారు… అక్కడ రోడ్ల సదుపాయం, వైద్య సౌకర్యాల మెరుగుదలకు సుమారుగా రూ.3 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.

ఇంతటి కీలకమైన సమస్యను తీర్చడానికి ప్రభుత్వ ఖజానాలో తగినన్ని నిధులు లేవు. గత ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్ కోసం రూ.500 కోట్లు, జగనన్న సర్వే రాళ్లు పాతేందుకు రూ.1200 కోట్ల రూపాయలను దుబారా చేసింది. గత ప్రభుత్వం ఇష్టానుసారం ఖర్చు చేసిన నిధులే కనుక ఈ రోజు మన దగ్గర ఉంటే కనీసం 1400 గిరిజన గ్రామాలకు రోడ్ల సదుపాయం, వైద్య సదుపాయాలకు వీలుడేంద’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి ముందు చూపుతో గిరిజన గ్రామాలకు మూడు దశల్లో రోడ్లు సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పడం ఆనందం కలిగించిందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం నుంచి తిరిగి పుంజుకోవడానికి మనమంతా సమష్టిగా ముందుకు వెళ్లాలి… గత ప్రభుత్వ విధానాలను క్షేత్రస్థాయి అధికారులు వీడాలని స్పష్టం చేశారు.

ప్రజలకు ఏది అవసరమో గుర్తించి, రాష్ట్రానికి ఏది సముచితమో అర్థం చేసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో ఐశ్వర్య, ఆరోగ్య, ఆనందాంధ్రప్రదేశ్ సాకారమే లక్ష్యంగా ‘స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్’ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో పాటు పవన్ కళ్యాణ్ విజన్ డాక్యుమెంటును ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు తిలకించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “ట్విన్ టవర్స్ వంటి అద్భుతమైన కట్టడాలను నిర్మించడం చాలా కష్టం. వాటిని కూల్చివేసేందుకు తీవ్రవాదులకు నిమిషాలే పట్టింది. ఏ వ్యవస్థ అయినా, నిర్మాణాన్ని అయినా నిర్మించడం చాలా కష్టం. కూల్చేయడం తేలిక. గత ప్రభుత్వం కూల్చివేతలతో తన పాలనను మొదలుపెట్టి పూర్తిగా కూలిపోయింది.

ప్రజలు చాలా బలవంతులు. అన్నీ నిశితంగా గమనిస్తుంటారు. గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని వారు కళ్లారా చూశారు కాబట్టే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వైసీపీని పరిమితం చేశారు.

అధికారులు వారి బలం వారే తెలుసుకోవాలి
నిన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా మాట్లాడుతూ… ‘హనుమంతుని శక్తి ఆయనకు తెలియదు. సీతమ్మ వారిని తీసుకురావడానికి వెళ్ళేప్పుడు సముద్రం దాటడానికి ముందుకు వెళ్ళమంటే, నాకు శక్తి లేదు అనగానే జాంబవంతుడు ఆయన బలాన్ని ఆయనకు తెలియజేస్తాడు.

అప్పుడు ఆయన సముద్రాన్ని లంఘించగలిగాడు. అదే విధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు మీ శక్తిని మీరు తెలుసుకోవాలి’ అన్నారు. వ్యవస్థలను గాడిలో పెట్టే కీలకమైన శక్తి ప్రభుత్వ కార్యనిర్వాహక యంత్రాంగం దగ్గర ఉంది.

దానిని తెలుసుకొని పని చేస్తే మనందరం కలలుగనే కొత్త ఆంధ్రప్రదేశ్ కచ్చితంగా సాధ్యం. మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో వ్యవహరించినట్లుగా ఒత్తిళ్ళకు, భయాలకు అతీతంగా పనిచేయండి.

మీకు కచ్చితంగా ప్రభుత్వ మద్దతు ఉంటుంది. మీరు చేసే పని ప్రజలకు మేలు చేసేది అయితే దానిని ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటాం. అధికారుల చేత బలంగా పని చేయించాలి అంటే ప్రజలు భాగస్వామ్యులు కావాలి.

• ముందు చూపుతో భవిష్యత్తును అంచనా వేయాలి
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1994 సమయంలో విజన్ 2020 అని చెప్పినప్పుడు అపహాస్యం చేసిన వ్యక్తులే ఈరోజు సైబరాబాద్ ప్రాంతంలో స్థలాలు కొనుక్కుని ఆనందంగా ఉన్నారు. 2047 నాటికి రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో తీసుకువచ్చిందే ఈ “స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్”.

ఏ రంగం ఎలా ముందుకు వెళ్లాలి? ఏ రంగానికి భవిష్యత్తులో ప్రాధాన్యం ఉంటుంది? ఆ రంగాల్లో మనం ఎలా ప్రగతి సాధించాలి అన్న పూర్తి విజన్ మనకున్నప్పుడే భవిష్యత్తు అందంగా మారుతుంది. అలాంటి గొప్ప భవిష్యత్తును ముందుగానే ఊహించగల దార్శనికులు చంద్రబాబు . రాబోయే కాలంలో యువతకు ఉద్యోగాలు ఉండాలి.

2047 నాటికి సాంకేతికతతో కూడిన వ్యవసాయం వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ పెరగాలి. నాణ్యమైన విద్య, వైద్యం అందరికి అందాలి అనే గొప్ప లక్ష్యాలతో ప్రతీ ఒక్కరి అభిప్రాయాలు తీసుకుని ఈ డాక్యుమెంట్ రూపొందించారు. ఇది సాకారం చేసేందుకు క్షేత్ర స్థాయి నుంచి పైస్థాయి వరకు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది.

చంద్రబాబు విజన్ చాలా గొప్పగా ఉంటుంది. దాని కోసం ఐకమత్యంగా మనమంతా కష్టపడితే భావితరాలకు గొప్ప భవిష్యత్తును అందించవచ్చు.

• రూల్ ఆఫ్ లా బలంగా ఉండాలి
చాలా మంది పెట్టుబడుదారులు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రధాన కారణం అక్కడ రూల్ ఆఫ్ లా చాలా బలంగా ఉండటం. రూల్ ఆఫ్ లా అనేది బలంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ది సాధిస్తుంది. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకునే ప్రతీ ఒక్కరికి కూడా రూల్ ఆఫ్ లా సమానంగా ఉండాలి.

అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతలు బలంగా ఉండాలి. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి పెట్టుబడుదారులు తరలివస్తారు. అప్పుడు రాష్ట్రం కూడా అభివృద్ధి బాట పడుతుంది. ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములే.

స్వర్ణాంధ్ర విజన్ 2047 ఇది ప్రతీ ఒక్కరి సమగ్ర బాధ్యత. “ప్రతి ఒక్కరి జీవితంలో సంపద రావాలి. శక్తి రావాలి. సుస్థిరత రావాలి. సమగ్రాభివృద్ధి చెందాలి” ఇదే మన సంకల్పం. ఇది మహా సంకల్పంగా మారాలి.

• మన రాష్ట్రంలో అద్భుత వనరులు ఉన్నాయి
గోవా గొప్ప పర్యటక ప్రాంతం. ఆ రాష్ట్రానికి సగం ఆదాయం పర్యటకం మీదనే వస్తోంది. మన రాష్ట్రానికి కూడా విశాలమైన తీరప్రాంతం ఉంది. గోవా కంటే అద్భుతాలు చేయగలిగే వనరులు మన దగ్గర ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఒక మాఫియా తరహా వ్యక్తులు రాష్ట్ర పర్యటకాన్ని పూర్తిగా దిగజార్చారు.

రాష్ట్రానికి వచ్చే విదేశీ పర్యటకులను భయపెట్టారు. పర్యటకులకు రక్షణ కల్పించడం మన ప్రధాన బాధ్యత. మన రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన పర్యటక ప్రదేశాలు ఉన్నాయి. పర్యటకం కోసం వచ్చేవారిని సొంత మనుషుల్లా చూసుకుని, వారికి తగిన ఆతిథ్యం ఇస్తే వాళ్లు మరోసారి మన రాష్ట్రానికి పర్యటకం కోసం వస్తారు.

అలాంటి గొప్ప సంస్కృతి మళ్లీ రావాలి. రాష్ట్రం పర్యటకంగా కళకళలాడాలి. టూరిజం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. దానివల్ల రాష్ట్రం పురోగమిస్తుంది. ప్రజలకు కూడా ఏదైనా విషయంలో నిరసన తెలిపే హక్కు ఉంటుంది. అయితే అది ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. మీరు ఆవేశంలో ఒక బస్సు తగలపెడితే దాని నష్టం పన్ను రూపంలో మీ మీదనే పడుతుంది. అందుకే మీరు ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించేలా ఉండాలి.

• ముఖ్యమంత్రి గారు, నేను పరస్పరం గౌరవించుకుంటాం…
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాకు ఎంతో గౌరవం ఇస్తారు. ఏ విషయంలో కూడా సంప్రదింపులు లేకుండా ముందుకు వెళ్లరు. నేను కూడా ఆయన నాయకత్వ తీరును, ఓపికను దగ్గర నుంచి గమనిస్తూ ప్రతి అంశాన్ని ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలని భావిస్తాను.

2014లో సైతం విభజిత ఆంధ్రప్రదేశ్ బలంగా ముందుకు వెళ్లాలంటే చంద్రబాబు లాంటి గొప్ప నాయకుడు అవసరం అనే ఆనాడు ఏమీ ఆశించకుండా మద్దతు ఇచ్చాం. ఇప్పుడు ఆయన నాయకత్వంలో పని చేయడం కూడా గొప్ప అదృష్టంగానే భావిస్తున్నాం.

ప్రజలు మనల్ని నమ్మి ఇచ్చిన మెజారిటీని, వారి ఆశలను నెరవేర్చేలా ఆయన, నేను ఎల్లప్పుడూ పనిచేస్తాం.నేను ఆయనను ముందు వెళ్ళమని చెప్పినా సరే ఆయన మాత్రం కలిసి నడుద్దాం అని చెప్తారు. ఇది ప్రతీ ఒక్కరూ అర్దం చేసుకుని విభేదాలు పక్కన పెట్టి రాష్ట్ర వృద్ధిలో భాగస్వామ్యులు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

• కులం దాటి అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం
21వ శతాబ్దంలో కూడా- నా కులం, నా వర్గం అంటే కష్టం. విభేదాలు, సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. సమస్యలు అందరికి ఉంటాయి. వాటిని శాంతియుత పంథాలో పరిష్కరించుకుందాం. ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది.

ఈ సమయంలో కూడా కులాలు, మతాలు అని కూర్చుంటే అభివృద్ధి ముందుకు వెళ్లదు. దానిని దాటి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి అందరి ఆలోచన కావాలి. ఎంతో గొప్ప నాయకత్వ లక్షణాలు ఒక భావ జాలాన్ని బలంగా తీసుకువెళ్లగల సత్తా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి కి మా సంపూర్ణ సహకారం ఉంటుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కలగన్న వికసిత్ భారత్ 2047లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి కావాలి. వికసించిన భారతంలో ఆంధ్రప్రదేశ్ చిరునవ్వులు విరబూయాలి. భారత్ ను చూసి ప్రపంచ దేశాలు భయపడాలన్నా, అభివృద్ధిలో చైనా లాంటి దేశాన్ని అధిగమించాలన్నా సరే దేశ అభివృద్ధితోపాటుగా స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధించడం చాలా కీలకం అనేది అర్థం చేసుకోవాల”న్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, 13 ఉమ్మడి జిల్లాల నుంచి పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

About Author