వివిధ పంటలలో 8 నూతన వంగడాలను విడుదల చేస్తున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్ 18,2024:సెంట్రల్ వెరైటల్ రిలీజ్ కమిటీ, రాష్ట్రస్థాయి వెరైటల్ రిలీజ్ కమిటీల ఆమోదంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్ 18,2024:సెంట్రల్ వెరైటల్ రిలీజ్ కమిటీ, రాష్ట్రస్థాయి వెరైటల్ రిలీజ్ కమిటీల ఆమోదంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ పంటలలో నూతన వంగడాలను విడుదల చేసింది.
వరి, మొక్కజొన్న, రాగి, సజ్జ, జొన్న పంటలలో మొత్తం ఎనిమిది రకాలను విడుదల చేసినట్లు ఉపకులపతి ఎం. రఘునందన్ రావు, పరిశోధన సంచాలకులు డాక్టర్ పి. రఘురామి రెడ్డి వెల్లడించారు.

వరిలో రాష్ట్రస్థాయి వెరైటల్ రిలీజ్ కమిటీ ఆమోదంతో రెండు రకాలు, సెంట్రల్ వెరైటల్ రిలీజింగ్ కమిటీ ఆమోదంతో మరో రెండు రకాలను విడుదల చేశారు. అలాగే రాష్ట్రస్థాయి వెరైటల్ రిలీజ్ కమిటీ ఆమోదంతో జొన్న, రాగి సజ్జ పంటలో ఒక్కొక్కటి చొప్పున అలాగే సెంట్రల్ వెరైటల్ కమిటీ ఆమోదంతో మొక్కజొన్నలో ఒక రకాన్ని విడుదల చేసినట్లు వివరించారు.
వరి లో విడుదలైన రకాల వివరాలు:
రాష్ట్రంలో గత కొన్ని ఏళ్లుగా వరివిస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ ఉండడంతో నీటిపారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో ఒకే ఏడాది రెండు పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంది.
ఇందుకోసం తక్కువ కాల వ్యవధితోపాటు అగ్గి తెగులు, సుడిదోమ, ఉల్లికోడుల ను తట్టుకొనే రకాల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని వరిలో కొత్తగా నాలుగు రకాలను రైతులకు PJTSAU అందుబాటులోకి తెచ్చింది.
రాజేంద్రనగర్ వరి పేరిట RNR -28361 అను దొడ్డు గింజల రకాన్ని రాష్ట్రస్థాయి వెరైటల్ కమిటీ ఆమోదంతో విడుదల చేసినట్లు ఎం. రఘునందన్ రావు, డాక్టర్ రఘురామి రెడ్డి తెలిపారు. అలాగే తెలంగాణ వరి- (KNM- 7037) పేరిట తక్కువ పంట కాలం కలిగిన, సన్నని, పొడవైన గింజ, తక్కువ నూక శాతం (దిగుబడి 62.3 కిలోలు), నాణ్యత కలిగిన అన్నం లక్షణాలు కలిగిన ఈ రకాన్ని జాతీయస్థాయిలో విడుదల చేసినట్లు వివరించారు.

సుడిదోమ, అగ్గి తెగులు, ఎండుకోళ్ళు తెగులును తట్టుకొనే తెలంగాణ వరి- 1289 (WGL-1289)ను కూడా జాతీయస్థాయిలో PJTSAU విడుదల చేసింది. ఇది తెలంగాణతో పాటు చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలోనూ సాగు చేయడానికి అనుకూలమైన రకమని డాక్టర్ రఘురామి రెడ్డి తెలిపారు. అలాగే ఉల్లికోడు బయోటైప్ లను తట్టుకొనే వరంగల్ వరి- 119 ను కూడా రాష్ట్ర స్థాయిలో విడుదల చేయడం జరిగింది.
మొక్కజొన్న:- కాండం కుళ్ళు తెగులు తట్టుకొని అధిక దిగుబడి నిచ్చే DHM-206 అనే నూతన మొక్కజొన్న హైబ్రిడ్ ను జాతీయస్థాయిలో విడుదల చేయడం జరిగింది. ఇది ఉత్తర భారత దేశంలోని వివిధ రాష్ట్రాలలో సాగుకు అనుకూలమైన మొక్కజొన్న హైబ్రిడ్.
జొన్న:- యాసంగిలో సాగుకు రైతులు ఎక్కువగా మొగ్గు చూపే మాల్దండి జొన్న రకానికి ధీటుగా, తాండూర్ పరిశోధన స్థానం నుంచి SVT -55 అను కొత్త జొన్న రకం ను విడుదల చేశారు. జొన్న రొట్టె నాణ్యతతో ఉండడం దీని ప్రత్యేకత.

సజ్జ & రాగి:- పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ద్వారా అధిక ఇనుము, అధిక జింక్ కల్గిన PBH – 1625, సజ్జ హైబ్రిడ్ ను అలాగే రాగిలో అధిక కాల్షియం కలిగిన PRS-38 రకాన్ని రాష్ట్రస్థాయిలో విడుదల చేయడం జరిగింది.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పడిన తర్వాత గత 8 ఏళ్లలో వివిధ పంటలలో 61 నూతన వంగడాలను రైతులకు అందుబాటులోకి తేవడం జరిగింది. అందులో భాగంగా వరిలో- 25, మొక్కజొన్న- 2, జొన్న- 5, అపరాలు- 11, నూనె గింజలు- 7, పత్తి-1, పశుగ్రాస పంటలలో 10 రకాలను విడుదల చేయడం జరిగింది.
అందులో రాష్ట్ర స్థాయిలో 23, జాతీయ స్థాయిలో 38 రకాలను విడుదల చేసినట్లు ఉపకులపతి ఎం. రఘునందన్ రావు, పరిశోధన సంచాలకు డాక్టర్ రఘురామి రెడ్డి తెలిపారు.