“సన్న, చిన్న కారు రైతుల ప్రయోజనాల కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం కొత్త వ్యూహాలు అమలు చేయాలి” – ఎమ్మెల్సీ ప్రొఫెసర్ M. కోదండరాం..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్ 12,2025: వ్యవసాయ విశ్వవిద్యాలయం 61వ వ్యవస్థాపక దినోత్సవం ఈరోజు రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగింది.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్ 12,2025: వ్యవసాయ విశ్వవిద్యాలయం 61వ వ్యవస్థాపక దినోత్సవం ఈరోజు రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగింది. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ M. కోదండరాం వ్యవస్థాపక దినోత్సవ ప్రసంగం చేశారు. “అద్భుతమైన వారసత్వం – భవిష్యత్తు సవాళ్లు” అన్న అంశంపై ఆయన ప్రసంగించారు.
స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ఆహార అవసరాలు తీర్చే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయని అందులో భాగంగానే హైదరాబాద్ లోనూ 1964లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటైందారు. ఆ విశ్వవిద్యాలయం రూపొందించిన ఎన్నో వంగడాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందాయన్నారు.
దేశంలో అమలు చేసిన భూ సంస్కరణలు, హరిత విప్లవాలు సత్ఫలితాలు ఇచ్చినప్పటికీ కొన్ని అసమానతలకి కారణం అయ్యాయని కోదండరాం వివరించారు. తెలంగాణలోనూ రైతాంగం తీవ్ర దుర్బర పరిస్థితుల్ని ఎదుర్కొన్నదని చివరకు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి ఏర్పడిందన్నారు.
ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ సహకారం అయిందని కాబట్టి సన్న, చిన్నకారు రైతాంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన విశ్వవిద్యాలయానికి సూచించారు. రైతులకి ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుండడంతో పాటు తమ పంటలకి సరైన గిట్టుబాటు ధరలు లభించడం లేదన్నారు. దానితోపాటు వాతావరణ మార్పుల వల్ల రైతాంగం కొత్త సవాళ్లు ఎదుర్కొంటుందన్నారు.
ఈ నేపథ్యంలో సన్న, చిన్నకారు రైతాంగానికి ప్రయోజనకరమైన నూతన వ్యూహాల్ని అనుసరించాలని, విశ్వవిద్యాలయం తమ పాత్రని పునర్ నిర్వచించుకోవాలని కోదండరాం సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం సహా అన్ని విశ్వవిద్యాలయాలల్లోనూ పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయని ప్రస్తుత ప్రభుత్వం వాటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటుందన్నారు.

రైతులు సంఘటితంగా సహకార ధోరణితో పని చేయాలన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ మధ్య నిర్వహిస్తున్న ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని కోదండరాం అభినందించారు. భవిష్యత్తులోనూ ఇటువంటివి కొనసాగించాలని కోదండరాం సూచించారు.
వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయం తీవ్రమైన మార్పులకి లోను కానుందని ప్రముఖ పాత్రికేయుడు పాశం యాదగిరి అన్నారు. నేడు నకిలీ విత్తనాలు, ఎరువులతో రైతులు కుదేలవుతున్నారని, భూసారం క్షీణిస్తుందన్నారు. విశ్వవిద్యాలయం తెలంగాణ సాంప్రదాయ పంటలు, చిరుధాన్యాలపై పరిశోధనలు చేసి రైతాంగానికి ఉపయోగపడాలని పాశం యాదగిరి సూచించారు.
రైతు, వ్యవసాయం సుభిక్షంగా ఉండాలంటే వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాలు సమన్వయంతో పనిచేయాలని మాజీ ఐఏఎస్ వి. నాగిరెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయం గత ఘన చరిత్రని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని నాగిరెడ్డి సూచించారు. తెలంగాణ పరిస్థితుల నేపథ్యంలో సమర్థ నీటి యాజమాన్యం అత్యవసరం అని విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి డాక్టర్ S. రఘువర్ధన్ రెడ్డి అన్నారు.
తాను ఉపకులపతిగా ఉన్నప్పుడు అనేక దేశ, విదేశీ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు కుదుర్చుకొని పనిచేశామని.. వాటిని పునరుద్ధరించాలని ప్రస్తుత ఉపకులపతి జానయ్యకు సూచించారు. విశ్వవిద్యాలయం పరిధిలో మంచి ఏరువాక కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయని వాటి ద్వారా సమర్థవంతమైన విస్తరణ సేవలు రైతాంగానికి అందించాలని రఘువర్ధన్ రెడ్డి సూచించారు.

దేశంలో ఏర్పాటైన రెండవ వ్యవసాయ విశ్వవిద్యాలయ 61వ వ్యవస్థాపక దినోత్సవం తన హయాంలో నిర్వహించడం తనకు చాలా సంతోషాన్నిస్తుందని PJTAU ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అన్నారు. తాను ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యవస్థల్ని పునర్ వ్యవస్థీకరిస్తూ కొత్త విభాగాల్ని ఏర్పాటు చేశానన్నారు. డిజిటల్ అగ్రికల్చర్ కోసం ప్రత్యేక విభాగం, సహజ వనరుల, పర్యావరణ విభాగం తదితరాలు ఏర్పాటు చేశామన్నారు. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీతో కలిసి తొలిసారి డ్యూయల్ డిగ్రీ ప్రవేశపెట్టనున్నామని జానయ్య వివరించారు.
మూడు విశ్వవిద్యాలయాలు కలిసి పనిచేస్తూ రైతాంగానికి అధునాతన టెక్నాలజీలు సేవల్ని అందించాలని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ డి. రాజి రెడ్డి, పి.వి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి జ్ఞాన ప్రకాష్ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా 60 ఏళ్ల విశ్వవిద్యాలయం ప్రస్థానానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అలాగే ఒక వీడియోని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, పూర్వ అధికారులు, బోధన, బోధనతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.