వైకుంఠ ఏకాదశి ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష సమావేశం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల, 30 డిసెంబరు 2024: తిరుమలలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల, 30 డిసెంబరు 2024: తిరుమలలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సోమవారం సాయంత్రం టీటీడీ సీఈవీఎస్వో శ్రీధర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో అదనపు ఈవో టీటీడీ అధికారులు, పోలీసులతో సమన్వయం చేస్తూ వైకుంఠ ద్వార దర్శన సమయంలో వాహనాల రాకపోకలు సజావుగా ఉండేలా,ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి రోజుల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుని వాహనాలు సక్రమంగా సాగేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.

భక్తుల కోసం టోకెన్లు లేదా టికెట్ల పైన ఉన్న నిర్దేశిత తేదీ, సమయానికి అనుగుణంగా మాత్రమే దర్శనాలు కల్పించబడతాయని, అందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు రేడియో, సోషల్ మీడియా, ఎస్వీబీసీ ప్రోమోలు, సూచిక బోర్డులు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలని ఆయన సూచించారు.
పార్కింగ్ స్లాట్‌లను వికేంద్రీకరించి దాదాపు 13,000 వాహనాల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అదనపు ఈవో ఆదేశించారు. గరుడ సేవ తరహాలో రామ్ భగీచా వద్ద ఎక్కువ సంఖ్యలో బగ్గీలను ఏర్పాటు చేయాలని సూచించారు.

వైకుంఠ ఏకాదశి రోజున సరైన భద్రతా ఏర్పాట్లు ఉండేలా, స్థానిక పోలీసులతో కలిసి ఆక్టోపస్ టీమ్ సేవలను కూడా ఉపయోగించుకోవాలని భద్రతా అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ సత్యనారాయణ, ఇతర టీటీడీ అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.