శ్రీశైలంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక పర్యటన..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, శ్రీశైలం, అక్టోబర్ 16, 2025: గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, శ్రీశైలం, అక్టోబర్ 16, 2025: గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి గురువారం శ్రీశైలం దేవస్థానాన్ని సందర్శించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అధికారులు, వేద పండితులు,జిల్లా అధికారులు పూర్ణకుంభ స్వాగతంతో వారిని ఆలయంలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఆలయ సేవలో పాల్గొన్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ మొదటగా మల్లికార్జున స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం, భ్రమరాంబ అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. కుంకుమార్చన పూర్తయిన తర్వాత, ఆలయ ప్రాంగణంలో కొంత సమయం ధ్యానంలో గడిపారు. వేద పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య మోదీ, చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ కి ఆశీర్వచనం అందజేశారు.

ఆలయ అధికారులు మోదీకి స్వామివారి,అమ్మవారి ప్రసాదాలతో పాటు ఆలయ చిత్రపటాన్ని గౌరవపూర్వకంగా అందజేశారు. అదే సమయంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా శ్రీశైల ఆలయ కళా రూపాన్ని మోదీ కి బహుకరించారు. ఆలయ అధికారులు మోదీ కి ఆలయ విశేషాలను వివరించారు. సుమారు ఒక గంట సేపు ప్రధాని ఆలయంలో గడిపారు.
శ్రీ శివాజీ మహారాజ్ స్మారక స్ఫూర్తి కేంద్ర సందర్శన
శ్రీశైలంలోని ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ స్మారక స్ఫూర్తి కేంద్రాన్ని మోదీ , చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ సంయుక్తంగా సందర్శించారు. కేంద్రంలో గోడలపై శివాజీ మహారాజ్ జీవిత విశేషాలను వివరించే చిత్రాలను మోదీ ఆసక్తిగా పరిశీలించారు.
కేంద్రంలో ఉన్న అతిపెద్ద శివాజీ చిత్రానికి నమస్కరించారు. దర్బార్ హాలు,ధ్యాన మందిరాల ప్రాముఖ్యతను అధికారులు వివరించారు. ధ్యాన మందిరంలోని అమ్మవారి విగ్రహానికి పూలు సమర్పించి నమస్కరించారు. కేంద్రం నిర్వహణ వివరాలను తెలుసుకొని, నిర్వాహకులను మోదీ అభినందించారు.