మిథున్ చక్రవర్తికి హృదయపూర్వక అభినందనలు :ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 30, 2024:ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 30, 2024:ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషాన్ని కలిగించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా, ఆయన మిథున్ చక్రవర్తికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
హిందీ,బెంగాలీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన మిథున్ చక్రవర్తి, 1980వ దశకంలో యువతపై ప్రబల ప్రభావం చూపారు. ఆయన నటించిన ‘డిస్కో డ్యాన్సర్’ చిత్రంలోని నృత్య శైలులు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. “ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్…” అనే పాట ఇప్పటికీ ప్రజలకు గుర్తుండిపోతుంది.
హిందీ చిత్రసీమలో అమితాబ్ బచ్చన్ తరువాత అంత క్రేజ్ సాధించిన కథానాయకుడిగా నిలిచిన మిథున్ చక్రవర్తి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల’ సినిమాలో లీలాధర్ స్వామిగా కీలక పాత్ర పోషించారు.
విద్యార్థి దశలో వామపక్ష భావజాలం కలిగి ఉన్న మిథున్, పిమ్మట టీఎంసీ, ఆ తరువాత బీజేపీలో చేరారు. దశాబ్ద కాలంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్న మిథున్ చక్రవర్తి, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోనున్న సందర్భంగా, ఆయనకు భగవంతుడు సంపూర్ణ సంతోషాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రార్థించారు.