ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డీలిస్టింగ్‌నకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,ఆగస్టు 21,2024: స్టాక్ ఎక్స్చేంజీల నుంచి ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ను డీలిస్ట్ చేయడాన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ), ముంబై నేడు ఆమోదించింది.

ఉత్తర్వుల్లో జస్టిస్ వీరేంద్ర సింగ్ జి. బిష్త్,సాంకేతిక సభ్యులు ప్రభాత్‌ కుమార్‌తో కూడుకున్న డివిజన్ బెంచ్, స్కీమును ఆమోదిస్తూ జారీ చేసిన మౌఖిక ఆదేశాల్లో క్వాంటమ్ మ్యుచువల్ ఫండ్, మైనారిటీ షేర్‌హోల్డర్ మను రిషి గుప్తా దాఖలు చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఆదేశాల వివరాలు త్వరలోనే అప్‌లోడ్ చేయనున్నాయి.

స్టాక్ ఎక్స్చేంజీల నుంచి తమ షేర్లను డీలిస్ట్ చేసి, అంతిమంగా మాతృ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్‌నకు పూర్తి అనుబంధ సంస్థగా మారేలా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ 2023 జూన్‌లో ఒక ప్రణాళికను ప్రకటించింది. స్కీము ప్రకారం ఐసీఐసీఐ షేర్‌హోల్డర్లకు తమ దగ్గరున్న ప్రతి 100 షేర్లకు గాను ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు 67 లభిస్తాయి.

అయితే, మైనారిటీ షేర్‌హోల్డర్ల విషయంలో స్వాప్ నిష్పత్తి సక్రమంగా లేదని ఆరోపిస్తూ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లో 0.002% వాటా ఉన్న మైనారిటీ షేర్‌హోల్డర్ మను రిషి గుప్తా, 0.08% వాటా ఉన్న క్వాంటమ్ మ్యుచువల్ ఫండ్, డీలిస్టింగ్‌ను వేర్వేరుగా వ్యతిరేకించాయి. అయితే, వారి అభ్యంతరాలను ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చింది. 93.8% మంది ఐసీఐసీఐ సెక్యూరిటీస్ షేర్‌హోల్డర్లు గతంలో ఆమోదించిన స్కీమును సమర్ధించింది.

అభ్యంతరాలను సవాలు చేసిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ప్రతిపాదిత కంపెనీ డీలిస్టింగ్‌కి వ్యతిరేకంగా దాఖలైన రెండు దరఖాస్తులు షేర్‌హోల్డర్ డెమోక్రసీ సూత్రాలను పూర్తి భంగపర్చే విధంగా ఉన్నాయని వాదించింది. అలాగే, కంపెనీల చట్టంలోని సెక్షన్ 230 బట్టి కనీసం 10 శాతం ఈక్విటీ లేదా 5 శాతం డెట్ వాటా కలిగి ఉన్న వారు మాత్రమే స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్‌పై అభ్యంతరాలు చెప్పవచ్చని కంపెనీల చట్టంలోని సెక్షన్ 230 (4)లోని నిబంధన సూచిస్తోందని, దీన్ని బట్టి దరఖాస్తుదార్లకు ఎటువంటి లోకస్ స్టాండి లేదని పేర్కొంది.

డీలిస్టింగ్ తర్వాత, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లను పొందడం ద్వారా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ షేర్‌హోల్డర్లు లబ్ధి పొందగలరని, ఒడిదుడుకులుండే బ్రోకింగ్ వ్యాపారంతో పోలిస్తే ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ల లిక్విడిటీ, ప్రైస్ డిస్కవరీ మెరుగ్గా ఉండగలదని మార్కెట్ నిపుణులు తెలిపారు.

About Author