జనవాణి కార్యక్రమంలో బాధితుల ఫిర్యాదులు: భూ ఆక్రమణలు, పరిహారం తాయిలాలపై వాపోయిన రైతులు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 9,2024: భూ సేకరణ చేయలేదు.. పరిహారం ఇవ్వలేదు.. మా భూమిలో అక్రమంగా జగనన్న కాలనీ కట్టేశారు..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 9,2024: భూ సేకరణ చేయలేదు.. పరిహారం ఇవ్వలేదు.. మా భూమిలో అక్రమంగా జగనన్న కాలనీ కట్టేశారు.. భూ యజమానికి అందాల్సిన పరిహారంతో వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారు. కోర్టు చెప్పినా అధికారులు వినడం లేదు.
న్యాయం కోసం కోర్టు మెట్లెక్కనందుకు చంపేస్తామన్న బెదిరింపులు తప్ప ఏమీ మిగలలేదు… మంగళగిరి కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో కడప జిల్లా, బద్వేలు నియోజకవర్గం, కొండలవీడు గ్రామానికి చెందిన బి. సుబ్బారెడ్డి అనే బాధితుడు ఫిర్యాదు చేశారు.

తమ భూమిలో ఇళ్లు కట్టి రోడ్లు సైతం వేసేశారని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు మొక్కజొన్న పంట కొని రెండేళ్లుగా డబ్బు ఇవ్వకుండా తిప్పుకుంటున్నరని త్రిపురాంతకం ప్రాంతానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు.
సోమవారం ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసన సభ్యులు ఆరవ శ్రీధర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించగా, రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు చెప్పుకొనేందుకు బాధితులు పదుల సంఖ్యలో తరలి వచ్చారు. ప్రతి ఫిర్యాదుని నిశితంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.
త్రిపురాంతకం మండలానికి చెందిన 34 మంది రైతులు తాము పండించిన స్వీట్ కార్న్ రకం మొక్కజొన్న పంటను మాజీ ఎంపీ నందిగం సురేష్ సమీప బంధువు, ఆయన అనుచరులు అయిన జున్ను జగదీష్ కి అమ్మామని, రూ. 23 లక్షల విలువైన పంట కొనుగోలు చేసి డబ్బు అడిగితే ముఖం చాటేశారని జనవాణిలో ఫిర్యాదు చేశారు.

మొదట అదిగో ఇదిగో అని దాటవేత ధోరణిలో మాట్లాడారని, నిలదీస్తే నందిగం సురేష్ అనుచరులమని బెదిరిస్తున్నారని వాపోయారు. రాజధాని ప్రాంతానికి చెందిన జున్ను జగదీష్ నుంచి తమకు రావాల్సిన మొత్తం ఇప్పించాలని వేడుకున్నారు.ఆరవ శ్రీధర్ స్థానిక పోలీసు అధికారులతో మాట్లాడి కేసు నమోదు చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని దిశా నిర్దేశం చేశారు.
‘మా తాతల నాటి భూమిపై వైసీపీ నేతల కన్ను పడింది. 70 ఏళ్లుగా మా కుటుంబ ఆధీనంలో ఉన్న భూమి మాది కాదు అని అధికారులతో చెప్పిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మా భూమి ఆన్ లైన్ కాకుండా చేశారు.
1954లో మా పూర్వీకులకు ఇచ్చిన పట్టా ఆధారం ఉన్నా మా భూమిపై మాకు హక్కులు కల్పించేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు.
మా తండ్రి నుంచి సంక్రమించిన భూమిపై మాకు హక్కులు కల్పించేలా చేయాల’ని అన్నమయ్య జిల్లా, ముదివేడు గ్రామానికి చెందిన రొయ్యల రమేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

‘గన్నవరం నియోజకవర్గం, బాపులపాడు గ్రామంలో ఉన్న 489 ఎకరాల భూమి పొరపాటుగా నిషేధిత 22ఏ జాబితాలో కలిసింది. నాటి జిల్లా కలెక్టర్ సాయంతో రికార్డుల పరిశీలన చేసిన పిదప అవి పట్టా భూములేనని తేలింది. మొత్తం భూమి ఆన్ లైన్ చేసి పాసు పుస్తకాలు ఇచ్చారు.
అందులో 25 ఎకరాల భూమికి పాసు పుస్తకాలు రాలేదు. మా భూ సమస్య పరిష్కరించండి’ అంటూ శ్రీమతి దుర్గాభవాని అనే మహిళ ఫిర్యాదు చేశారు. అదే విధంగా వ్యక్తిగత సమస్యలు, ప్రభుత్వ కార్యాలయల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై వివిధ వర్గాల ప్రజలు అర్జీలు సమర్పించారు.
కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సిహెచ్. సుందరరామిరెడ్డి, నందిగామ నియోజకవర్గ పీఓసీ శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి, న్యాయ విభాగానికి చెందిన బయ్యారపు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.