తెలంగాణలో Rs.10 నాణేల అంగీకారంపై రాష్ట్రవ్యాప్త ప్రజా చైతన్య ప్రచారం – హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 16,2024: ప్రైవేట్ రంగంలో అగ్రగామి అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ₹10 నాణేలపై

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 16,2024: ప్రైవేట్ రంగంలో అగ్రగామి అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ₹10 నాణేలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో రెండు రోజుల పబ్లిక్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ నిర్వహించింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వ్యాపించిన 430 బ్యాంకు శాఖలు, 542 బీసీల ద్వారా ఈ క్యాంపెయిన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ₹10 నాణేలు చట్టపరమైన చెల్లుబాటుకు సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడం, నాణేలపై విశ్వాసం పెంపొందించడం ఈ కార్యక్రమానికి ప్రధాన లక్ష్యంగా ఉంది.

ఈ అవగాహన కార్యక్రమం భారతీయ రిజర్వు బ్యాంక్ సహకారంతో నిర్వహించబడింది. ఈ క్రమంలో బ్యాంకు రూ. 10.96 లక్షల విలువైన ₹10 నాణేలను ప్రజలకు పంపిణీ చేసింది. గత ఏడాదిలో మొత్తం రూ. 16.90 లక్షల విలువైన నాణేలను పంపిణీ చేసినట్లు బ్యాంకు ప్రకటించింది.
ప్రముఖ మార్కెట్ ప్రాంతాలు, రైతు బజార్‌లు, స్థానిక మార్కెట్‌లలో పోస్టర్‌లు, బ్యానర్‌లు, కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా, బ్రాంచ్ డిజిటల్ లెడ్ స్క్రీన్‌లు, ఏటీఎంలలో ప్రత్యక్ష ప్రదర్శన కూడా నిర్వహించారు.
రిటైల్ వ్యాపారులు, రోడ్ రవాణా, పీఎం స్వనిధి లబ్ధిదారులు, చిరు వ్యాపారులు, కిరాణా దుకాణాలు వంటి వినియోగదారులు ఈ అవగాహన కార్యక్రమం ద్వారా లావాదేవీలకు అవసరమైన చిన్న మార్పు పొందినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమం సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & రీజినల్ హెడ్ శ్రీ వెంకటేష్ చల్లావర్ మాట్లాడుతూ, “రాష్ట్రంలోని వివిధ నగరాల్లో ఈ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల మాకు ఆనందంగా ఉంది. ఈ క్యాంపెయిన్ ప్రజలలో నాణేల వినియోగాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన రిజర్వు బ్యాంక్‌కు మా కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.