పిఠాపురంలో రైల్వే అభివృద్ధి: ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, రైళ్ల హాల్ట్ కోసం విజ్ఞప్తి
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, నవంబర్ 27, 2024: పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సామర్లకోట – ఉప్పాడ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, నవంబర్ 27, 2024: పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సామర్లకోట – ఉప్పాడ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) అత్యవసరమని, దీన్ని త్వరితగతిన మంజూరు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
మంగళవారం ఢిల్లీలో వైష్ణవ్ ని కలిసిన పవన్ కల్యాణ్ పిఠాపురం రైల్వే అభివృద్ధి సహా పలు ప్రజల సమస్యలపై చర్చించారు.
సామర్లకోట–ఉప్పాడ రైల్వే ఓవర్ బ్రిడ్జి అవసరం
సామర్లకోట-ఉప్పాడ రోడ్డులోని రైల్వే కి.మీ 640/30-32 వద్ద లెవెల్ క్రాసింగ్ నంబర్ 431కు బదులుగా ఓవర్ బ్రిడ్జి నిర్మించడం అవసరమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది.
ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు రహదారి కనెక్టివిటీ మెరుగుపరచడానికి ఈ మౌలిక సదుపాయం కీలకమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి ‘గతి శక్తి’ కార్యక్రమం ద్వారా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
పిఠాపురం రైల్వే స్టేషన్‌లో ముఖ్యమైన రైళ్లకు హాల్ట్
శ్రీపాద వల్లభ స్వామి దేవాలయానికి భక్తుల రాకపోకలను సులభతరం చేయడమే కాక, ప్రయాణికుల సౌకర్యం కోసం పిఠాపురం రైల్వే స్టేషన్‌లో నాలుగు కీలక రైళ్లకు హాల్ట్ మంజూరు చేయాలని పవన్ కల్యాణ్ అభ్యర్థించారు.
ఈ రైళ్లు:
- నాందేడ్ – సంబల్పూర్ నాగావళి ఎక్స్‌ప్రెస్
- నాందేడ్ – విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- విశాఖపట్నం – సాయి నగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్
- ఏపీ ఎక్స్‌ప్రెస్ (విశాఖపట్నం – న్యూఢిల్లీ).
లాతూరు ప్రజల విన్నపం
లాతూరు ప్రజల అభ్యర్థనగా లాతూరు నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ ప్రతిపాదనను కూడా రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై పరిశీలించి చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ కోరారు.