జీఎస్టీ 2.0: సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే సంస్కరణ..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, కర్నూలు, అక్టోబర్ 16, 2025: గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలైన జీఎస్టీ 2.0 సంస్కరణ సామాన్య ప్రజలకు గణనీయమైన

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, కర్నూలు, అక్టోబర్ 16, 2025: గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలైన జీఎస్టీ 2.0 సంస్కరణ సామాన్య ప్రజలకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సంస్కరణ ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000 వరకు ఆదా అవుతుందని, విద్య,వైద్య ఖర్చుల భారం నుంచి ఊరట లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
కర్నూలు నగర శివారులోని నన్నూరు వద్ద నిర్వహించిన ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర,రాష్ట్ర మంత్రులతో కలిసి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ఆత్మ నిర్భర భారత్‌తో ప్రపంచ పటంలో భారత్
పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతూ, “దేశంలో పన్నుల భారం తగ్గిన దాఖలాలు అరుదు. కానీ, నరేంద్ర మోదీ జీఎస్టీ 2.0 సంస్కరణ ద్వారా సామాన్యులకు, పేదలకు పెద్ద ఎత్తున ఊరట కల్పించారు. ఆత్మ నిర్భర భారత్ ద్వారా భారతదేశాన్ని ప్రపంచ పటంలో గర్వంగా నిలబెట్టారు. దేశంలో, రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. గూగుల్ వంటి అతిపెద్ద ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌కు రావడం దీనికి నిదర్శనం” అని తెలిపారు.

మోదీ ని కర్మ యోగిగా అభివర్ణిస్తూ, “ధర్మాన్ని ఆచరిస్తూ దేశ సేవే పరమ లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు మోదీ. ఆయన రెండు తరాలను ముందుకు నడిపిస్తూ, భావి తరానికి మార్గదర్శనం చేస్తున్నారు. భారత్ ఒక అగ్రగామి దేశమని, ఎవరికీ భయపడని దేశమని చేతల ద్వారా నిరూపించారు” అని అన్నారు.
పెట్టుబడులకు స్థిరమైన ప్రభుత్వం కీలకం
“పెట్టుబడులు రావాలంటే ప్రభుత్వాలపై నమ్మకం ఉండాలి. కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్లపాటు స్థిరంగా కొనసాగాలి. ఒర్వకల్లు పారిశ్రామిక వాడలోనే రూ.4,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. మోదీ మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకువెళ్తాము” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా,మోదీ రూ.13,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ప్రధాని సత్కారం
సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ సభ వేదికపై గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సత్కరించారు. మహాశివుని ప్రతిమను బహూకరించి గౌరవించారు.