రూ. 28 కోట్లతో నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం చర్యలు: మంత్రి పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ ఆన్ లైన్ న్యూస్, మే 9,2025: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి,గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి

వారాహి మీడియా డాట్ ఆన్ లైన్ న్యూస్, మే 9,2025: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి,గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు.

వార్తా మాధ్యమాల్లో వచ్చే కథనాలు, ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తక్షణమే స్పందించాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన వాటర్ వార్ రూమ్‌ల ద్వారా నీటి కొరత ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు.

వేసవిలో నీటి కొరత సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర నిధుల కింద రూ. 28 కోట్లు విడుదల చేసిందని ఆయన తెలిపారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలు, నేరుగా నీటి సరఫరాకు వీలులేని అటవీ, శివారు ప్రాంతాల్లో సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉండాలని ఆయన అన్నారు.

గురువారం గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారులతో రాష్ట్ర,జిల్లా స్థాయిల్లో వాటర్ వార్ రూమ్‌ల ఏర్పాటు, నిర్వహణపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు ఇప్పటివరకు పరిష్కరించిన సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా వేసవిలో ఎదురయ్యే తాగునీటి సమస్యలు, వివిధ మాధ్యమాల ద్వారా వస్తున్న ఫిర్యాదులను మంత్రి పరిశీలించారు. వార్ రూమ్‌ల ద్వారా సమస్యల పరిష్కారానికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “రాష్ట్రవ్యాప్తంగా ఎదురయ్యే తాగునీటి సమస్యలను సమర్థంగా పరిష్కరించడానికి వెంటనే అన్ని జిల్లాల్లో వాటర్ వార్ రూమ్‌లను ఏర్పాటు చేయాలి. గ్రామీణ నీటి సరఫరా విభాగం చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో ఈఎన్సీ కార్యాలయం నుంచి ప్రతిరోజూ వాటర్ వార్ రూమ్‌ల కార్యకలాపాలను సమన్వయం చేసుకోవాలి.

జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు,వార్ రూమ్ సిబ్బందితో చీఫ్ ఇంజనీర్ టెలీకాన్ఫరెన్సులు నిర్వహించాలి. క్లిష్టమైన ప్రాంతాల్లో తాగునీటి కొరతను తగ్గించడానికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, ప్రైవేట్ నీటి వనరులను అద్దెకు తీసుకోవడం, తాత్కాలిక నీటి సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేయడం, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను ఎప్పటికప్పుడు నింపడం, నీటి సరఫరా వ్యవస్థలు,చేతి పంపులకు మరమ్మతులు చేయడం వంటి చర్యలు తీసుకోవాలి” అని ఆదేశించారు.

ఇది కూడా చదవండి…జమ్మూ కాశ్మీర్‌లో పలు చోట్ల డ్రోన్ల తో పాక్ దాడులు, తిప్పికొట్టిన భారత సైన్యం..

This is also read.. Lakshmi’s Salon & Academy Inaugurates First Branch in RK Puram, Kothapet, Hyderabad

This is also read..LG Electronics India Begins Construction of Third Manufacturing Facility in Sri City, Andhra Pradesh

ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాలో లోపాలను నివారించడానికి ఆర్డబ్ల్యూఎస్ వన్ యాప్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆయన సూచించారు. ప్రస్తుతం అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 180 నీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి, ట్యాంకర్ల ద్వారా 33,232 ట్రిప్పుల నీటిని ప్రజలకు సరఫరా చేసినట్లు అధికారులు నివేదించారు.

రాబోయే రోజుల్లో తాగునీటి అవసరాలు మరింత పెరుగుతాయని, దానిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన అన్నారు. ఎక్కడెక్కడ నీటి వనరులు ఉన్నాయో గుర్తించి మ్యాపింగ్ చేయాలని సూచించారు.

“తాగునీటి సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, సిబ్బంది, పంచాయతీరాజ్ ఉద్యోగులు సమన్వయంతో ముందుకు సాగాలి” అని ఆయన దిశానిర్దేశం చేశారు.

About Author