ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే అమృతధార: జల్ జీవన్ మిషన్ పథకం పై పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 19,2024: ‘జల్ జీవన్ మిషన్ పనుల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి. ఇప్పుడున్న నీటి వనరులకు కొత్తరూపు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 19,2024: ‘జల్ జీవన్ మిషన్ పనుల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి. ఇప్పుడున్న నీటి వనరులకు కొత్తరూపు తీసుకురావడంతో పాటు కొత్త నీటి వనరులను సృష్టించుకోవడం అవసరం. నీటి నిర్వహణ, సరఫరా విషయంలోనూ పటిష్టమైన ప్రణాళిక ఉండాల’ని ఉప ముఖ్య మంత్రి వర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు అందించాలనే బృహత్తర ప్రణాళికకు అంతా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. జల్ జీవన్ మిషన్ పనులకు ఎలా మొదలుపెట్టాలి… ఎలా ముందుకు తీసుకెళ్లాలి… పటిష్టంగా ఎలా పూర్తి చేయాలనే విషయాలను అధికార యంత్రాంగం సమన్వయం చేసుకొని పనిచేయాలని, కేవలం పనులు చేసి వదిలేయడం కాకుండా, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు (గ్రీవెన్స్) కోసం కూడా ప్రత్యేక సమయాన్ని కేటాయించాలన్నారు.

జల్ జీవన్ మిషన్ పథకం సమర్థంగా అమలు చేసేందుకు, జిల్లావారీగా ప్రత్యేక డీపీఆర్ తయారు చేసేందుకు, పథకం ఫలాలను వినియోగించుకునేందుకు అన్ని జిల్లాల పంచాయతీరాజ్, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం అధికారులతో ‘అమృతధార’ కార్యక్రమం వర్క్ షాపును విజయవాడలో బుధవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ హాజరై కీలకోపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల తాగు నీటి అవసరాలను గుర్తించి ముందుకు వెళ్లాలి. జల్ జీవన్ పనులన్నీ ప్రజలకు ఫలాలు అందించాల్సిన తరుణంలో వారి సూచనలకు పెద్దపీట వేయాలి.
జన వనరుల లభ్యత, వాటి నుంచి పొందాల్సిన ప్రయోజనం, ఇతర అంశాలను నిశీతంగా పరిశీలించి శాశ్వతంగా ఫలితాలు అందేలా జల్ జీవన్ మిషన్ పనులను మొదలుపెట్టాలి.
• ఇప్పటికీ తాగు నీటి కోసం ఇబ్బందులు తప్పడం లేదు
స్వాతంత్య్రానంతరం భారతదేశం ప్రజలకు తాగు నీటిని అందించేందుకు లక్షల కోట్లను ఖర్చు చేసింది. ప్రతి మనిషికి స్వచ్ఛమైన తాగు నీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. ప్రతి మనిషికీ సగటున రోజుకి 55 లీటర్ల మంచి నీరు అందించాలనే ఉన్నత లక్ష్యంతో 2019లో జల్ జీవన్ మిషన్ పథకం ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షల మేరకు మొదలైంది.

భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం సందర్భంగా కాని, రంజాన్ రోజుల్లో ముస్లిం సోదరులు పాటించే ఉపవాస దీక్షల్లో గాని ఒక పూట నీరు అందకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసు. 2008లో ఆదిలాబాద్ తండాల్లో తిరుగుతున్నపుడు చూపులేని ఓ వృద్ధురాలు కాస్త నీళ్లిప్పించయ్యా.. అన్న మాట నాకెప్పుడూ తల్చుకున్నా కళ్లలో గిర్రున నీళ్లు తిరిగేలా చేస్తాయి.
నా శాఖల్లో అత్యంత కీలకమైంది.. నాకు ఇష్టమైంది గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి అందించే కీలక బాధ్యత. స్వచ్ఛమైన తాగునీరు అందితే ప్రజల సంతోషం అంతాఇంతా కాదు. వారికి స్వచ్ఛమైన నీరు అందితే చాలావరకు ఇతర సమస్యలు తొలగిపోతాయి. ప్రజలంతా ఆనందంగా ఉండటానికి మంచినీరు అందడం అనేది ప్రధానం.
• కేరళ కంటే తక్కువగా ప్రతిపాదనలు
ఈ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టాక జల్ జీవన్ మిషన్ పనుల గురించి పలుమార్లు సమీక్ష చేశాను. ఇంతటి కీలకమైన పథకం, ప్రజలందరికీ మేలు చేసే ఈ పథకం తీరుతెన్నులను, జరిగిన పనులను తెలుసుకున్నాను.
అనుకున్నంత విజయవంతంగా పనులు జరగలేదని అర్థమైంది. 2019లో జల్ జీవన్ మిషన్ పథకం ప్రారంభించే ముందు ప్రతి రాష్ట్రం తాగునీటి అవసరాలకు సంబంధించి, ప్రతి ఒక్కరికీ తాగునీరు అందించేందుకు ఎంత మేర నిధులు అవసరం అవుతాయని కేంద్ర ప్రభుత్వం – రాష్ట్రాలను ప్రతిపాదనలు అడిగినపుడు ఉత్తర ప్రదేశ్ రూ.1.50 లక్షల కోట్లు, మధ్యప్రదేశ్ రూ.83 వేల కోట్లు, గుజరాత్ రూ.32 వేల కోట్లు, కేరళ రూ.45 వేల కోట్లు అడిగింది.

కేరళను తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కంటే చాలా చిన్న రాష్ట్రం. అయినప్పటికీ వారు భవిష్యత్తు అవసరాలు, ప్రజలకు అందించాల్సిన పూర్తి తాగునీటి పనులు కావాలంటే నిధులు ఎక్కువ అవసరమవుతాయనే ప్రణాళికతో అంత మొత్తం అడిగారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం గత ప్రభుత్వ పాలకులు మాత్రం కేవలం రూ.26 వేల కోట్లు చాలు అన్నట్లుగా ప్రతిపాదనలు పంపారు.
• గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేదు
దీంతో కేంద్రం మొదటి దశలో రూ.4,787 కోట్ల పనులు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కచ్చితంగా రాష్ట్ర వాటాగా మ్యాచింగ్ గ్రాంటు కేటాయించాలనే నిబంధన ఉంటుంది. జల్ జీవన్ మిషన్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన మ్యాచింగ్ గ్రాంటు కూడా విడుదల చేయకపోవడంతో కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాం.
• పథకం ఆశయాలకు తూట్లు పొడిచి బోర్ వెల్స్ కు అనుసంధానం
జల్ జీవన్ మిషన్ పనుల్లో శాశ్వత నీటి వనరుల మీద దృష్టి సారించడం అనేది కీలకం. నేను ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ తో సమావేశం అయినప్పుడు కూడా గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకంలో సమీపంలోని రిజర్వాయర్లు, ఇతర అతి పెద్ద నీటి వనరుల నుంచి నీటిని గ్రామాలకు ఇవ్వాల్సిందిపోయి భూగర్భ జలలాను బోర్ల ద్వారా అందించే ఏర్పాట్లు చేసిందని చెప్పారు.

భూగర్భ జలాలను పెంపొందించేందుకు జల్ జీవన్ మిషన్ పథకం అధిక ప్రాధాన్యం ఇస్తే, గత రాష్ట్రం ప్రభుత్వం మాత్రం రిజర్వాయర్లు, నీటి వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోకుండా కేవలం బోర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రంలో 38 మేజర్ రిజర్వాయర్ల ద్వారా 95.44 లక్షల తాగునీటి కుళాయిలకు అనుసంధానం చేయాల్సి ఉంది.
అయితే గత ప్రభుత్వ పాలకులు మాత్రం కేంద్ర జల్ జీవన్ మిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి బోర్ల ద్వారా నీటిని అందించేందుకు ఇష్టానుసారం పనులు చేశారు. నీటిని ఎక్కడ నుంచి.. ఎలా తీసుకురావాలి..? ఏ పద్ధతిలో నీటిని అందించాలనే కనీస అవగాహన లేకుండా, ముందుగా గ్రామాల్లో పైపులైన్లు వేసేశారు.
దగ్గర్లోనే బోరు పాయింటుకు దీని ద్వారా కనెక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. బోరు పాయింట్ల ద్వారా గ్రామాలకు తాగు నీటి నిరంతర సరఫరా అనేది సాధ్యం కాదు. బోర్ల ద్వారా తాగేందుకు అనువైన తాగు నీరు అందుతుందన్న గ్యారెంటీ లేదు. దీంతో గత ప్రభుత్వం ఈ పథకంలో ఖర్చు చేసిన రూ.4 వేల కోట్లు, దుర్వినియోగం అయిపోయాయని భావించాలి.

• కేంద్ర ప్రభుత్వానికి రూ.70 వేల కోట్ల అవసరం అని చెప్పాం
కొత్త ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి సూచనల ప్రకారం జల్ జీవన్ మిషన్ పథకంలో రిజర్వాయర్లు, నీటి వనరుల నుంచి నీటిని ఎంత సమర్థంగా గ్రామాలకు అందించాలనే విషయంలో కసరత్తు చేశాం.
ఇటీవల కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్ ని కలిసినప్పుడు కూడా రాష్ట్ర తాగు నీటి అవసరాలకు మేరకు, జల్ జీవన్ మిషన్ పథకం లక్ష్యాల మేరకు కనీసం రూ.70 వేల కోట్లు అవసరం అవుతాయని, రాష్ట్రానికి కేటాయించిన నిధులను పెంచాలని కోరాను. దీనికి కేంద్ర మంత్రివర్యులు మీకు రూ.70 వేల కోట్ల అవసరాలకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సమర్పించాలని కోరారు. దీనిపై ఇప్పుడు దృష్టి సారించాం.
రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు సురక్షిత మంచి నీరు అందించేందుకు అవసరమైన పనులకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టును జనవరిలోగా రూపొందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. దీన్ని కేంద్ర మంత్రివర్యులకు పంపుతాం.

• సర్వే ద్వారా అసలు లెక్కలు బయటకు….
నేను ఏ జిల్లాకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినా ప్రజలంతా మాకు తాగునీరు లేదని చెబుతున్నారు. దీంతో అధికార యంత్రాంగాన్ని నేను గత ప్రభుత్వం అసలు జల్ జీవన్ మిషన్ పనుల్లో ఏం పనులు చేసింది..? ఎంత మందికి తాగునీటి అందించింది..? ఎన్ని కుళాయి కనెక్షన్లు ఇచ్చారు..? వాటి పరిస్థితి ఏంటీ అనే దానిపై పల్స్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పాం.
గత ప్రభుత్వ పాలకులు చెప్పిన లెక్కల్లో 70.04 లక్షల కుటుంబాలకు నీటి కుళాయిలు ఇచ్చేశాం. ఇంకా 25.40 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. 4 వారాలపాటు నిర్వహించిన పల్స్ సర్వే నిర్వహించిన తర్వాత 85.22 లక్షల కుటుంబాలకు గాను, 55.37 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్ ఇచ్చినట్లు, 29.85 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్ ఇవ్వాల్సి ఉందని తేలింది. అయితే దీనిలో కూడా ఎక్కువశాతం జల్ జీవన్ మిషన్ పనులన్నీ బోర్ వెల్స్ ఆధారంగానే చేశారు. ఇది జల్ జీవన్ మిషన్ ఆశయానికి పూర్తిగా విరుద్ధం.
• అమృతధారలో పక్కా ప్రణాళికతో డీపీఆర్ తయారు చేద్దాం
ఇప్పుడు ఈ అమృతధార వర్క్ షాపు లో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల అధికారులకు చెప్పేదేమంటే జల్ జీవన్ మిషన్ పనుల పూర్తి కోసం కేంద్రం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోంది. దీన్ని ఉపయోగించుకొని మనమంతా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చే బాధ్యతను తీసుకోవాలి.
శాశ్వతంగా వారి సమస్యను తీర్చేలా, గ్రామీణులకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా మానవతా దృక్పథంతో, బాధ్యతతో కలిసి పని చేద్దాం. జల్ జీవన్ మిషన్ లో కేవలం పైపు లైన్లు వేసి హడావుడి చేయకుండా, ప్రతి గ్రామీణుడికి రోజుకు సగటున 55 లీటర్ల తాగు నీరు అందించే బృహత్తర బాధ్యతను తీసుకుందాం. కేంద్రం ఇచ్చే నిధులు ఎక్కడా దుర్వినియోగం కాకుండా పథక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని పని చేయాలి.

దీనికి అందరి సహకారం కావాలి. కేవలం పైపులైన్లు వేసి చేతులు దులుపుకోకుండా, అన్ని సాంకేతిక అంశాలు పరిశీలించి చివరి ప్రాంతాలకు సైతం తాగునీరు అందేలా చూడాలి. జల్ జీవన్ నిధుల్లో ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టకుండా పక్కా ప్రణాళికతో డీపీఆర్ తయారు చేయండి. సమగ్రంగా, సంవృద్ధిగా గ్రామీణ ప్రజలకు తాగునీరు అందించే బాధ్యతను తీసుకుందాం.
జల్ జీవన్ మిషన్ పథకం గడువు కాలం దగ్గరపడింది. దీనిపై ఇటీవల కేంద్ర పెద్దలతో మాట్లాడి గడువు మరింత కాలం పొడిగించాలని కోరాం. వెంటనే మన ప్రణాళికను తెలియజేస్తే, కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తుందనే ఆశాభావం ఉంది.
• పథకం ఫలాలు అందరికీ అందాలి
జల్ జీవన్ మిషన్ నిధులు ఇన్నివేల కోట్లు ఖర్చు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం నాకు చాలాచోట్ల దారుణమైన పరిస్థితులే కనిపించాయి. గత ప్రభుత్వం కనీసం ఫిల్డర్ బెడ్స్ కూడా చాలా చోట్ల మార్చలేదు. రూ.5 లక్షలు వెచ్చిస్తే ఫిల్డర్ బెడ్లకు ఇసుకను మార్చవచ్చు. అది కూడా చేయలేదు.
వాటర్ షెడ్ పథకం ఉపయోగించుకొని, నీటి నిర్వహణపై ప్రధానంగా దృష్టి సారించి ఈ గొప్ప ప్రయత్నంలో అంతా భాగస్వామ్యం అవుదాం. నేను డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడి మిమ్మల్ని ఆదేశించడం లేదు. ఈ గొప్ప కలను తీర్చేందుకు అంతా సమష్టిగా పని చేయాలని కోరుతున్నాను.

కోటి కుటుంబాలకు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సురక్షిత మంచినీటిని అందించాలనే ధ్యేయంతో ముందుకు వెళ్లే కార్యక్రమంలో మనసుపెట్టి పని చేద్దాం. రాష్ట్రంలో ఎక్కడా తాగు నీటి దాహం కేకలు లేని సమగ్రమైన జలాంధ్రప్రదేశ్ ను సాకారం చేద్దాం’’ అన్నారు.
• ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేద్దాం :శశిభూషణ్ కుమార్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి
శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ… “గ్రామీణులకు పరిశుభ్రమైన తాగు నీరు అందడం ప్రాథమిక హక్కుగా ఉండాలని గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అధికారులకు స్పష్టంగా చెబుతున్నారు.
ఈ క్రమంలోనే జల జీవన్ మిషన్ లో ఉన్న లోటుపాట్లను తెలుసుకోవడానికి పల్స్ సర్వే చేయించారు. దాదాపు 95 లక్షల గృహాలకు కుళాయిల ద్వారా ప్రతి మనిషికి రోజుకు సగటున 55 లీటర్లు చొప్పున స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలి. దీనికోసం జలజీవన్ మిషన్ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకుందాం.
ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కు అయిన మంచినీటిని సమృద్ధిగా అందించేందుకు సమష్టిగా పనిచేద్దాం. పూర్తిస్థాయి డీపీఆర్ లు ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా తయారు చేసేలా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ బృహత్తర యజ్ఞంలో పాలుపంచుకుందాం” అన్నారు.
ఈ సమావేశంలో శాసనమండలి విప్ పిడుగు హరిప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, గ్రామీణ రక్షిత తాగునీటి సరఫరా విభాగం చీఫ్ ఇంజినీర్ సంజీవరెడ్డి, జలవనరుల చీఫ్ ఇంజినీరు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.