హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ఘనంగా స్వామి వివేకానంద162వ జయంతి వేడుకలు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 14, 2024 :హైదరాబాద్ రామకృష్ణ మఠంలో స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 14, 2024 :హైదరాబాద్ రామకృష్ణ మఠంలో స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మాట్లాడుతూ.. శక్తి సామర్థ్యాలున్నప్పుడే ఉత్తమకార్యాలు చేయాలని, వృద్ధాప్యంలోకి వెళ్లాక చేస్తామనుకుంటే కుదరదని స్వామి వివేకానంద చెప్పారని తెలిపారు.

స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాల్లో భాగంగా రామకృష్ణ మఠంలోని వివేకానంద ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

విచక్షణ ద్వారా చెడును వదిలిపెట్టి మంచిని గ్రహించాలని వివేకానంద సూచించారని బోధమయానంద గుర్తు చేశారు. యువజన దినోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉన్న వివేకానంద విగ్రహానికి ఐపీఎస్ సౌమ్యా మిశ్రా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ట్యాంక్‌బండ్ నుంచి మఠం వరకూ అవేకనింగ్ ఇండియా వాక్ నిర్వహించారు.
ఆ తర్వాత ఇస్రో శాస్త్రవేత్త టీజీకే మూర్తి, విద్యావేత్త అనిల్ భరధ్వాజ్ ప్రసంగించారు. చంద్రయాన్ 3- సవాళ్లు- విజయం అనే అంశంపై ప్రసంగించిన అనిల్ భరధ్వాజ్ జై విజ్ఞాన్, జై అనుసంధన్ అనేది ప్రభుత్వ విధానమన్నారు.

సైన్స్ అండ్ టెక్నాలజీకి కేంద్రప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా పర్వతారోహకులు పూర్ణా మలావత్, వెన్నెల బనోత్‌కు వివేకానంద యంగ్ అచీవ్‌మెంట్ అవార్డులు బహుకరించారు.
పాలమూరుకు చెందిన సేవాభారతి కార్యకర్త కాశీనాథ్ చేస్తు్న్న సేవా కార్యక్రమాలను స్వామి బోధమయా నంద ప్రశంసించారు. యువజనోత్సవాల్లో భాగంగా థియేటర్ ఆర్ట్స్ స్పెషలిస్ట్ దీనబాంధవ దర్శకత్వంలో స్వామి వివేకానంద జీవితంపై వీఐహెచ్‌ఈ విద్యార్ధులు ప్రదర్శించిన నాటిక ఆకట్టుకుంది. ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.