ఆర్బీఐ కఠిన చర్యలతో పతనమైన ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకు సూచీలు..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్17,2023: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడాయి. అమెరికా, ఐరోపాలో ద్రవ్యోల్బణం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్17,2023: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడాయి. అమెరికా, ఐరోపాలో ద్రవ్యోల్బణం తగ్గడంతో ఉదయం బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడయ్యాయి. అలీబాబా షేర్లు, చైనా సూచీలు పడిపోగానే సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లోకి జారుకున్నాయి.
రిటైల్ రుణాలపై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకు సూచీలు పతనమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మూడు పైసలు నష్టపోయి 83.27 వద్ద స్థిరపడింది. విదేశీ సంస్థాగత మదుపర్లు నేడు రూ.477 కోట్లు విలువైన షేర్లను కొన్నారు. డీఐఐలు రూ.565 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.
క్రితం సెషన్లో 65,982 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 65,788 వద్ద మొదలైంది. వెంటనే పెరిగి 66,037 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాతే పతనం మొదలైంది. దీంతో 65,639 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరికి 187 పాయింట్ల నష్టంతో 65,794 వద్ద ముగిసింది.
శుక్రవారం 19,674 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,806 వద్ద ఇంట్రాడేలో గరిష్ఠాన్ని అందుకుంది. 19,667 వద్ద ఇంట్రాడేలో కనిష్ఠ స్థాయికి చేరుకుంది. మొత్తంగా 33 పాయింట్ల నష్టంతో 19,731 వద్ద క్లోజైంది. ఇక నిఫ్టీ బ్యాంకు ఏకంగా 577 పాయింట్లు పతనమై 43,583 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 50లో 28 కంపెనీలు లాభపడగా 22 నష్టపోయాయి. ఎస్బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్టీ, టాటా కన్జూమర్ టాప్ గెయినర్స్. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, ఓఎన్జీసీ, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్ టాప్ లాసర్స్. బ్యాంకు, ఫైనాన్స్, పీఎస్‌యూ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు తీవ్రంగా నష్టపోయాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్ సూచీలు ఎగిశాయి.
నిఫ్టీ నవంబర్ ఫ్యూచర్స్ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,900 వద్ద రెసిస్టెన్సీ, 19,720 వద్ద సపోర్ట్ ఉన్నాయి. నిఫ్టీ నష్టాల్లో ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ షేర్ల కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది.
లుపిన్ రూపొందించిన గనిరెలిక్స్ ఎసిటేట్ ఇంజెక్షన్‌కు యూఎస్ ఎఫ్‌డీఏ రెగ్యులేటర్ అనుమతి లభించింది. ఇంట్రాడేలో ఒకనొక సమయంలో 7.16 శాతం నష్టాల్లో ట్రేడైన రామకృష్ణ ఫోర్జింగ్స్ షేర్లు చివరికి 2 శాతం లాభంతో ముగిశాయి. 4.51 శాతం నష్టాల్లోంచి కోలుకున్న సుజ్లాన్ షేర్లు ఒక శాతం మేర ఎగిశాయి.
ఐఆర్ఎఫ్‌సీలో 12.1 లక్షల షేర్లు చేతులు మారాయి. ఆల్కెమ్, బజాజ్ ఆటో, కోల్గేట్ ఫామోలివ్, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, కేపీఐటీ టెక్నాలజీస్, మాక్స్ ఫైనాన్స్, ట్రెంట్, టైటాన్, టాటా మోటార్స్ షేర్లు ఇంట్రాడేలో 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. ఇంద్రప్రస్థ గ్యాస్‌లో 10 లక్షల షేర్లు చేతులు మారాయి.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709.