గచ్చిబౌలిలో డ్రగ్స్‌ వ్యతిరేక మారథాన్: ‘డాక్ట్రెస్’ ఆధ్వర్యంలో 5కే రన్..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, గచ్చిబౌలి,సెప్టెంబర్ 9,2025: మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డాక్ట్రెస్ (Doctress) సంస్థ గచ్చిబౌలి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, గచ్చిబౌలి,సెప్టెంబర్ 9,2025: మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డాక్ట్రెస్ (Doctress) సంస్థ గచ్చిబౌలి స్టేడియంలో 5 కిలోమీటర్ల మారథాన్‌ను విజయవంతంగా నిర్వహించింది. సెప్టెంబర్ 7న ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పరుగులో దాదాపు 600 మంది డాక్టర్లు, వైద్య విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెండా ఊపి మారథాన్‌ను ప్రారంభించిన అనంతరం, డాక్ట్రెస్ సంస్థ త్వరలో ప్రారంభించనున్న గ్లోబల్ ఇండియన్ డాక్టర్స్ అలయన్స్ (GLIDA) లోగోను ఆవిష్కరించారు.

‘డ్రగ్స్ వద్దు, నవ సమాజమే ముద్దు’

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్ వాడకం యువత భవిష్యత్తుకు పెను ప్రమాదమని, దీనిని అణచివేయడానికి ప్రభుత్వం ‘ఉక్కుపాదం’ మోపుతోందని తెలిపారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలను డాక్ట్రెస్ సంస్థ నిర్వహించడం అభినందనీయమని, ప్రతి గ్రామంలోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ శ్రీకీర్తి, డాక్టర్ శివలను ఆయన అభినందించారు.

నిర్వాహకులు డాక్టర్ శ్రీకీర్తి, ఆకుల శివకృష్ణ మాట్లాడుతూ, ఈ మారథాన్ కేవలం డ్రగ్స్‌కు వ్యతిరేకంగా మాత్రమే కాకుండా, డాక్టర్ల ఆరోగ్యం, వారిపై జరిగే దాడులకు వ్యతిరేకంగా అవగాహన కల్పించే ఉద్దేశంతో కూడా నిర్వహించామని తెలిపారు. డాక్టర్లను రక్షించాలనే భావనను ప్రోత్సహిస్తూ, డాక్టర్లు ముందుగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, సమాజంలో వారిపై జరిగే హింసాత్మక చర్యలను అరికట్టడానికి కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, నార్కోటిక్స్ బ్యూరో అధికారులు వడ్డే నవీన్, ఎల్. శ్రీనివాస్, కొలను జగ్ జీవన్ రెడ్డి (స్పోర్ట్స్ ఫెడరేషన్ వైస్ చైర్మన్) తదితరులు పాల్గొన్నారు. యువత సైనికుల్లా మారి మాదకద్రవ్యాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. పరుగులో పాల్గొన్న వారికి మెడల్స్, జ్ఞాపికలను బహుకరించారు.

About Author