పిఠాపురాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్న పవన్ కళ్యాణ్..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పిఠాపురం, నవంబర్ 14, 2025: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గంలోని

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పిఠాపురం, నవంబర్ 14, 2025: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గంలోని 19 ప్రముఖ ఆలయాల అభివృద్ధికి దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ (CGF) నుంచి రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఇందులో పురూహూతికా దేవి, శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.6 కోట్లు కేటాయించారు.

శుక్రవారం పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, దేవాదాయ శాఖ అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
“అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ పురూహూతికా అమ్మవారి ఆలయం, పాదగయా పీఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆలయం, కుక్కుటేశ్వర స్వామి ఆలయం – ఈ మూడు మహా పీఠాలతో పిఠాపురం దేశంలోనే అరుదైన ఆధ్యాత్మిక కేంద్రం. ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు.
ముఖ్య అభివృద్ధి పనులు:

శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో పిండప్రదాన మండపం, అన్నదాన మండపం నిర్మాణం, కోనేరు పునరుద్ధరణ (రూ.6 కోట్లు)
శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆలయానికి రూ.2 కోట్లు
శ్రీ సీతారామాంజనేయ ఆశ్రమం – రూ.60 లక్షలు
శ్రీ జై గణేష్ స్వామి ఆలయం – రూ.65 లక్షలు
చిత్రాడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం – రూ.70 లక్షలు

అదనంగా నవ ఖండ్రవాడ శ్రీ నృసింహస్వామి & నక్కులమ్మ అమ్మవారి ఆలయాలు, గొల్లప్రోలు శ్రీ సిరితల్లి ఆలయం, తాటిపర్తి శ్రీ మార్కండేయ స్వామి ఆలయం – ఈ నాలుగు ఆలయాలను ధూప దీప నైవేద్యం పథకం పరిధిలోకి తీసుకొచ్చేందుకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అంగీకారం తెలిపారు.

కార్తీక మాసం ముగిసే సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా మహిళా భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు, బందోబస్తు, సౌకర్యాలపై పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.
“ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆలయాల పరిరక్షణ, అభివృద్ధికి ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. పిఠాపురాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ఆలయాభివృద్ధి, టెంపుల్ టూరిజం కీలక భాగం” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

About Author